Begin typing your search above and press return to search.

పవన్ కి కేంద్ర మంత్రి పదవి....బీజేపీ నయా స్ట్రాటజీ...?

By:  Tupaki Desk   |   21 Sep 2022 3:30 AM GMT
పవన్ కి కేంద్ర మంత్రి పదవి....బీజేపీ నయా స్ట్రాటజీ...?
X
జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేస్తోందా. మరి కొద్ది నెలలలో మంత్రి వర్గాన్ని విస్తరించి కొందరిని కొత్తగా తీసుకోవాలనుకుంటున్న బీజేపీ ఏపీ కోటాలో పవన్ పేరుని చేర్చినట్లుగా చెబుతున్నారు. నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగిన తరువాత మళ్ళీ బలోపేతం చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణాకు అదనంగా మరో మంత్రి పదవిని ఇస్తారని అంటున్నారు. అలాగే ఏపీ నుంచి కూడా ఈసారి కచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుందని కూడా చెబుతున్నారు. అలా కనుక ఆలోచిస్తే ఏపీలో వచ్చే ఎన్నికల్లో తమకు అన్ని విధాలుగా రాజకీయ లాభాన్ని కలిగించే దిశగానే వ్యూహ రచన చేశారని అంటున్నారు. మిత్రపక్ష నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ణి ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా చేయాలని బీజేపీ పెద్దలు సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అంటున్నారు.

పవన్ కి సిని చరిష్మా ఉంది. అలాగే ఆయన ఏపీలో బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు. దాంతో ఆయన్ని కేంద్ర మంత్రిగా చేసి ఏపీలో బీజేపీ జనసేన కూటమిని బలోపేతం చేసుకోవాలని కమలం పార్టీ నయా స్ట్రాటజీకి దిగుతోందని అంటున్నారు. ఏపీ కోటాలో చూస్తే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రమే రాజ్యసభ ఎంపీగా పార్టీ నుంచి ఉన్నారు. ఆయనకు పదవి ఇవ్వాలని తొలుత‌ అనుకున్నా అదే పదవి పవన్ కి ఇస్తే కచ్చితంగా రాజకీయంగా ఉపయోగం ఉంటుందని లెక్కలు వేస్తున్నారుట.

ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టడానికి పవన్ కి అధికార బలం కూడా కలసి వస్తుందని కూడా భావిస్తున్నారుట. అదే టైం లో పవన్ టీడీపీ వైపు మళ్ళకుండా తమతోనే ఉంటారని కూడా ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన కూడా ఆరెస్సెస్ నుంచి బీజేపీకి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏపీలో బీజేపీ జనసేన కూటమి పటిష్టం చేయడం మీద ఆరెస్సెస్ ఇపుడు ఫోకస్ పెడుతోంది.

అయితే ఈ ప్రతిపాదన మీద పవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలని అంటున్నారు. ఎందుకంటే పవన్ కి వైసీపీకి బీజేపీకి మధ్య లోపాయికారీ అవగాహన ఉంది అన్న అనుమానాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీకి దన్నుగా ఉంటూ జగన్ ఏపీలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మరి అలాగైతే వైసీపీ మీద నిజమైన యుద్ధం ఎలా సాధ్యమని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. జగన్ తో తెర వెనక బంధాలు తెంచుకుంటేనే బీజేపీతో తాను మునుపటిలా సన్నిహితంగా ఉంటానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇది బీజేపీకి ఇబ్బందికరమే అంటున్నారు. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు, వైసీపీతోనే ఆ అవసరం తీరుతోంది. పైగా ఏపీలో తమకు పవర్ చాన్స్ రాకపోతే చంద్రబాబుకు దక్కకూడదు అన్న లెక్కలు బీజేపీకి ఉన్నాయని చెబుతారు. చంద్రబాబుని పెంచి పోషించాలన్న ఆలోచన వారికి ఏ విధంగానూ లేదు. దాంతో పవన్ని తమ వైపునకు తిప్పుకోవడానికే ఈ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేశారని అంటున్నారు. అయితే ఒక వైపు జగన్ని పెట్టుకుని మరో వైపు తనతో దోస్తీ అంటే బీజేపీతో కుదిరే వ్యవహారం కాదని పవన్ భావిస్తున్నారుట. అందుకే బీజేపీ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తన రూట్ సెపరేట్ అనే ఆయన ముందుకు వెళ్తున్నారు.

వచ్చే ఎన్నికల వరకూ వేచి చూసి బీజేపీ కనుక తన రోడ్ మ్యాప్ ని మార్చుకోకపోతే పవన్ సొంత నిర్ణయాల దిశగా వెళ్తారని అంటున్నారు. అందుకే ఆయన అన్ని ఆప్షన్లు దగ్గర పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇపుడు కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే ఎప్పటికీ బీజేపీ మనిషిగా ఉండిపోవాలని, ఏపీలో జగన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి అది అడ్డుపడుతుందని కూడా ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి బీజేపీ నిజంగా పవన్ కి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిందా అన్నది ఒక విషయమైతే పవన్ ఈ విషయంలో ఏమీ తేల్చకుండా ఉన్నారా అన్నవి కూడా మరో వైపు చూడాలి. ఏది ఏమైనా బీజేపీకి ఉన్న ఏపీ ఆశలు పవన్ని మరింతగా దగ్గరకు చేర్చుకునేలా చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ పవన్ నిర్ణయమే కీలకం అవుతుంది మరి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.