Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోసం బీజేపీ త్యాగం చేస్తుందా? ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   9 Aug 2021 12:30 AM GMT
ప‌వ‌న్ కోసం బీజేపీ త్యాగం చేస్తుందా?  ఏం జ‌రుగుతోంది?
X
ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బీజేపీ నేత‌లు.. ఏపీకి ముఖ్య‌మంత్రిని చేస్తారా? ఆయ‌న‌ను అధికార పీఠం ఎక్కిస్తారా? ఇది సాధ్య‌మేనా? బీజేపీ వ్యూహం నిజ‌మేనా? అస‌లు ఎందుకిలాంటి చ‌ర్చ సాగుతోంది? ఇవీ.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో కుదిపేస్తున్న ప్ర‌శ్న‌లు.దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇటీవ‌ల వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య ఉర‌ఫ్ నాని చేసిన కామెంట్లే కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. కాషాయ కండువా క‌ప్పుకున్న‌ ఓ నేత‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంద‌ని.. అందుకే త‌మ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని.. మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌లు ఈ చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

అధికారం పంచుకుంటారా?

విష‌యంలోకి వెళ్తే.. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీజేపీకి చేరువ‌య్యారు.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో చేతులు క‌లిపారు. బీజేపీ పెద్ద‌లు చెప్పిన‌ట్టే న‌డుచుకుంటున్నార‌నే వాద‌న కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్పుడు.. సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డిన‌.. ప‌వ‌న్ త‌ర్వాత మౌనం పాటిస్తున్నారు. అయితే.. బీజేపీ-ప‌వ‌న్‌ల మ‌ధ్య ఏర్ప‌డిన పొత్తు.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతుంద‌ని.. ఒక‌వేళ‌ అధికారం పంచుకున్నా.. బీజేపీ నేత‌లే సీఎం స్థానాన్నిద‌క్కించుకుంటార‌ని.. విశ్లేష‌ణ‌లు వున్నాయి. కానీ, తాజాగా మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌లు.. ఏకంగా ప‌వ‌న్‌ను సీఎంను చేసేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌నే చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

బీజేపీకి అవ‌మాన‌మేనా?

మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. ఏపీలో బీజేపీ క‌నుక‌ అధికారంలోకి వ‌స్తే.. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని.. ఒప్పందం జ‌రిగిందా? అందుకే ప‌వ‌న్‌.. బీజేపీతో చేతులు క‌లిపారా? అని అంటున్నారు మేధావులు. అయితే.. ప‌వ‌న్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే.. బీజేపీకి ఒరిగే ప్ర‌యోజ‌నం ఏంటి? ఒక‌వేళ‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో పోటీకి వెళ్లి.. ప్ర‌జ‌ల‌కు సీఎం అభ్య‌ర్థి.. ప‌వ‌నేన‌ని చెబితే.. ఇన్నేళ్ల సీనియార్టీ.. కేంద్రంలో రెండు సార్లు వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన పార్టీకి అవ‌మానం కాదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. నిజానికి ప‌వ‌న్‌కే సీఎం అయ్యే శ‌క్తి ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లోనే అయి ఉండేవార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు..

ఛాన్స్ మిస్ చేసుకున్నారే!

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తానే సీఎం అభ్య‌ర్థిన‌ని.. కానిస్టేబుల్ కొడుకుగా త‌న‌కు సీఎం అయ్యే అర్హ‌త లేదా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ముఖ్య‌మంత్రి కొడుకులే.. ముఖ్య‌మంత్రులు కావాలా? అని ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేశారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ సాధించింది ఏమిటో అంద‌రికీ తెలిసిందే. రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ప‌వన్ ఒక్క‌చోట కూడా విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. అంతేకాదు.. స‌రైన స్థానాల్లో ఓటు బ్యాంకును కూడా పుంజుకునేలా చేసుకోలేక పోయారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ ఇప్పుడు ప‌వ‌న్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా.. బీజేపీకి వ‌చ్చే ఫ‌లితం ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇరువురికి క‌ష్ట‌మే
అదేస‌మ‌యంలో గోవ‌ధ వ్య‌తిరేక నినాదం అందుకున్న బీజేపీతో ప‌వ‌న్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నా.. రాష్ట్ర నేత‌ల‌తో ఆయ‌న ట‌చ్‌లోకి రావ‌డం లేదు. అంటే..తాను సొంత‌గా ఎద‌గాల‌నే తాప‌త్ర‌యంతో ప‌వ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. పోనీ.. బీజేపీతో చేతులు క‌లిపినా.. రేపు సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా.. ప‌వ‌న్ ఇమేజ్‌కు ఇబ్బందులు రావ‌డం ఖాయ‌మ‌నేది మేధావుల మాట‌. త‌న బ‌లం లేక‌పోవ‌డంతోనే బీజేపీతో చేతులు క‌లిపార‌నే అప‌వాదు ఆయ‌న‌ను వెంటాడుతుంది. పైగా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు త‌న‌కు అనుకూలంగా మారుతుంద‌నేది కూడా క‌ష్ట‌మే. ఎలా చూసుకున్నా.. బీజేపీ చేస్తున్న ప‌వ‌న్ రాజ‌కీయం.. స‌క్సెస్ కాద‌ని అంటున్నారు.