Begin typing your search above and press return to search.

ఆ మాట అనకుంటే దవడ పగలకొట్టటమేనట

By:  Tupaki Desk   |   8 April 2016 9:53 AM GMT
ఆ మాట అనకుంటే దవడ పగలకొట్టటమేనట
X
మరే దేశంలో కనిపించని ఒక చిత్రమైన ఇష్యూ గత కొద్ది రోజులుగా దేశంలో చర్చనీయాశంగా మారింది. తాము నివసించే దేశాన్ని అమ్మ రూపంలో కొలుస్తూ.. జై చెప్పాలన్న అర్థాన్ని ఏ దేశంలోని వారైనా.. ఏ మతం వారైనా అనేందుకు మొహమాట పడరు. అస్సలు ఆలోచించరు. అదేం చిత్రమో కానీ.. ‘‘భారత్ మాతాకీ జై’’ అనే మాట తమ నోటి నుంచి రానేరాదంటూ భీష్మించుకోవటం ఒక ఎత్తు అయితే.. దాన్ని సైతం రాజకీయంగా మార్చే దుర్మార్గం మన దేశంలోనే కనిపిస్తుందేమో.

దేశాన్ని తల్లిగా భావించి.. ఆమెకు జై చెప్పటం కూడా తప్పుగా ప్రచారం చేయటం.. దానికి మత విశ్వాసాలకు ముడి పెట్టటం లాంటి ఇష్యూలతో గడిచిన కొద్దిరోజులుగా దేశంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ అంశంపై రాజకీయ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి చేసుకుంటున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయని చెప్పక తప్పదు. తాజాగా భారత మాతాకీ జై అనే నినాదంపై ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు.

ఆ నినాదాన్ని చేయని వారి దవడ పగలకొట్టాలంటూ ఆయన ఒక బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూస్థాన్ లో పుడతారు. ఇక్కడి నీరు తాగుతారు. చివరకు ఖననం చేయటానికి ఒక్కడి నేలే కావాలి. కానీ.. భారత్ మాతాకీ జై అని మాత్రం అనరా?’’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ మధ్యనే ఇలాంటి ఆవేశపూరిత వ్యాఖ్యల్ని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేయటం తెలిసిందే. మరి.. ఛత్తీస్ గఢ్ మంత్రి గారి మాటలు మరెన్ని మంటలు రేపుతాయో..?