Begin typing your search above and press return to search.

కుప్పం పిలుస్తోంది బాబూ ...!

By:  Tupaki Desk   |   11 Oct 2021 3:30 PM GMT
కుప్పం పిలుస్తోంది బాబూ ...!
X
అది ఏపీకి దూరంగా పొరుగు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. దాని గురించి ఎవరికీ బొత్తిగా పట్టని రోజులలో చంద్రబాబునాయుడు అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేశారు. అంతే కుప్పం పేరు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మారుమోగింది. వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల ఎలాగో బాబుకు కుప్పం అలాగా అన్నట్లుగా పొలిటికల్ గా గొప్పగా తమ్ముళ్ళు చెప్పుకునేవారు. మూడు దశాబ్దాలకు పైగా నారా ఫ్యామిలీని ఆదరిస్తోంది కుప్పం. చంద్రబాబు ఏ రోజు కూడా ఎమ్మెల్యే అభ్యర్ధిగా స్వయంగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయలేదు అక్కడ. అయినా కానీ అరలక్షకు తక్కువ కాకుండా మెజారిటీ ఇచ్చి గెలిపించిన పుణ్యం అంతా కుప్పం ప్రజలదే.

అలాంటి కుప్పం కోటలు బీటలు వారాయి. 2019 ఎన్నికల్లో బాబు మెజారిటీ ఏకంగా ముప్పయి వేల మెజారిటీకి పడిపోయింది. అది కూడా కొన్ని రౌండ్లలో చంద్రబాబు వెనకబడి మరీ తమ్ముళ్లకు తెగ టెన్షన్ పుట్టించారు. మొత్తానికి కుప్పంలో గెలిచి బాబు విజయ బావుటా ఎగరేసినా ఏపీలో టీడీపీ దారుణంగా ఓడింది. ఇక గత రెండున్నరేళ్ళుగా బాబు కుప్పం వెళ్ళింది తక్కువే. దాంతో కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అన్నీ కూడా వైసీపీకి జై కొట్టేశాయి. అంతే చంద్రబాబులో ఒక్కసారిగా కలవరం చెలరేగిందనే అంటున్నారు. ఇక కుప్పం టూర్ తప్పదని కూడా నిశ్చయానికి వచ్చారు.

ఈ మధ్యనే అంటే పంచాయతీ ఎన్నికల తరువాత మూడు రోజుల టూర్ చేసిన బాబు మరో విడతగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఈసారి కూడా మూడు రోజుల ప్రోగ్రాం ఉంది. అన్నీ ప్రాంతాలు కవర్ అయ్యేలా బాబు షెడ్యూల్ ఉంది. కుప్పం ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ ని కూడా దగ్గర పెట్టుకుని ముచ్చటించేందుకు బాబు సిద్ధపడుతున్నారు. మొత్తానికి బాబు ఇన్నాళ్ళకు నెలల తేడాలో వరసబెట్టి తమ ప్రాంతానికి రావడం పట్ల కుప్పం జనాలు సంతోషిస్తున్నారు. దానికి తమ ఓటు దెబ్బ పవరే కారణమని కూడా భావిస్తున్నారు. ఇక కుప్పంలో అభివృద్ధి పనులను ఒక వైపు వైసీపీ జోరుగా చేస్తోంది. బాబు ఈ టైమ్ లో విపక్ష నేతగా వరాలే ఇవ్వగలరు తప్ప ఏమీ చేయలేని స్థితి. దాంతో ఆయన పర్యటనల జోరు పెంచినా కుప్పం జనాలు మారుతారా, ఏమారుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా బాబుకు కుప్పం పదే పదే పిలుస్తోంది. ఆ విధంగా ఇన్నాళ్ళూ ఆయన్ని ఎమ్మెల్యేను చేసిన కుప్పం తొలిసారిగా తాను గెలుస్తోంది.