Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ టీ పార్టీకి చంద్రబాబు హాజ‌ర‌య్యేనా?

By:  Tupaki Desk   |   11 July 2022 7:49 AM GMT
జ‌గ‌న్ టీ పార్టీకి చంద్రబాబు హాజ‌ర‌య్యేనా?
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. జూలై 18న రాష్ట్రప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల‌న్నింటి త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అటు ద్రౌప‌ది ముర్ము, ఇటు య‌శ్వంత్ సిన్హా ఆయా రాష్ట్రాల‌ను చుట్టేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ వివిధ పార్టీల అధినేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను త‌మ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ద్రౌప‌ది ముర్ము జూలై 12 ఏపీకి చేరుకుంటారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ముర్ముకు సీఎం వైఎస్ జ‌గ‌న్ తోపాటు ముఖ్య నేత‌లు ఆమెకు స్వాగ‌తం ప‌లుకుతార‌ని తెలుస్తోంది. అక్కడి నుంచి మంగళగిరి చేరుకున్నాక అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముర్ము సమావేశం కానున్నారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోర‌నున్నారు. ఆ సమావేశంలో ముర్ముకు మద్దతు అంశం పైన సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు.

కాగా ఇప్ప‌టికే ద్రౌప‌ది ముర్ముకు వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నా.. కేబినెట్ సమావేశం కారణంగా హాజరు కాలేదు. సీఎం ప్రతినిధిగా ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ విజయ సాయిరెడ్డి హాజరయ్యారు. ఇక, మంగళగిరిలో సమావేశంలో ముగిసిన తరువాత ద్రౌపది ముర్ము గౌరవార్ధం సీఎ జగన్ తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు.

సీఎం నివాసంలో జరిగే టీ పార్టీలో ద్రౌప‌ది ముర్ము పాల్గొంటారు. సాధార‌ణంగా ఇలాంటి టీ పార్టీల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను కూడా పిల‌వ‌డం రివాజుగా వ‌స్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్... ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఈ టీ పార్టీకి పిలుస్తారా? పిల‌వ‌రా అనేదానిపై ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. టీ పార్టీకి జ‌గ‌న్ పిలిచే అవ‌కాశ‌మే లేద‌ని.. పిలిచినా చంద్ర‌బాబు వ‌చ్చే అవ‌కాశ‌మూ ఏమాత్రం లేద‌ని అంటున్నారు,

మ‌రోవైపు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఎవ‌రిక‌నేది టీడీపీ ఇంత‌వ‌ర‌కు చెప్ప‌లేదు. ఆ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్ స‌భ ఎంపీలు, ఒక రాజ్య‌స‌భ ఎంపీ ఉన్నారు. మ‌రోవైపు య‌శ్వంత్ సిన్హా కూడా చంద్ర‌బాబును క‌ల‌సి మ‌ద్ద‌తు కోర‌లేదు. తమను ఎవరు సంప్రదిస్తే వారికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.