Begin typing your search above and press return to search.

బాబు విజన్ తో జగన్ సంక్షేమాన్ని ఉఫ్ అని ఊదేస్తారా....?

By:  Tupaki Desk   |   18 Dec 2022 1:30 AM GMT
బాబు విజన్ తో జగన్ సంక్షేమాన్ని ఉఫ్ అని ఊదేస్తారా....?
X
జగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే తనకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఖజానా ఖాళీ అవుతున్నా తన తొలి ప్రాధాన్యతగా సంక్షేమానికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రతీ గడపకూ తిరిగి సంక్షేమ గురించి చాటి చెప్పాలని ఎమ్మెల్యేలను పురమాయిస్తున్నారు. వై నాట్ 175 అంటూ జగన్ ధీమా పడుతోంది కూడా సంక్షేమ పధకాలను చూసుకునే అని అంటున్నారు.

ఇక చంద్రబాబు ఈ మధ్య దాకా తాను కూడా అదే సంక్షేమ కార్యక్రమాలతో కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఆయన జిల్లా టూర్లలో సైతం టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం వైసీపీ సంక్షేమ పధకాలను పూర్తిగా అమలు చేస్తుంది. ఇంకా కొత్తవి కూడా మరెన్నో ప్రవేశపెడుతుంది అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే సంక్షేమం వర్సెస్ సంక్షేమం అన్నట్లుగానే ఇప్పటిదాకా వైసీపీ టీడీపీల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది.

ఈ విషయంలో ప్రస్తుతానికి అయితే వైసీపీది పై చేయిగా ఉన్నట్లుగా కూడా అంచనాలు ఉన్నాయి. సంక్షేమం విషయంలో టీడీపీ ఎన్నికల ప్రణాళికతో వస్తే మార్పు ఉంటుంది అని అనుకుంటున్నారు. అయితే ఏపీలో సంక్షేమం తో పాటుగా తన మార్క్ అభివృద్ధిని జోడిస్తే తప్ప వైసీపీని దెబ్బ కొట్టలేమని తెలుగుదేశం అనుకుంటోంది. సరిగ్గా ఈ సమయంలో బాబు విజన్ కి హైదరాబాద్ లో నీరాజనం పట్టే సందర్భం వచ్చింది

బాబు ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవాలలో ఆయనకు బ్రహ్మరధం పట్టారు. బాబు ఒకనాటి విజన్ ఈ నాటి డెవలప్మెంట్ అని కూడా నిర్వాహకులు కీర్తించారు. దాంతో ఇపుడు బాబు తన వ్యూహం మార్చుకుంటున్నారు అని అంటున్నారు. మరో మారు తన మార్క్ విజన్ కి పదును పెట్టడం ద్వారా ఏపీలో జనాలను పూర్తిగా తిప్పుకోవచ్చు అని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

హైదరాబాద్ లో తాను నాటిన విత్తనాలు ఈ రోజు వృక్షాలుగా మారి మంచి ఫలితాలు ఇస్తున్నాయని బాబు చెప్పుకునే వీలు కలిగింది.హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి ఏపీ జనాలు తనకు ఓటేయాలని బాబు ఎన్నికల్లో కోరే అవకాశాలు ఉన్నాయి. అమరావతి రాజధానికి సాటి లేని మేటిగా తీర్చిదిద్దుతానని ఏపీని అద్భుతంగా నిలుపుతాను అని బాబు ఇక మీదట జరిగే ప్రచారంలో కొత్త స్టేట్మెంట్స్ ఇస్తారని అంటున్నారు.

నిజానికి బాబుకు మంచి దార్శనీకుడిగా పేరు ఉంది. అదే విధంగా బాబు పరిపాలనాదక్షుడిగా చూస్తారు. బాబు సైతం నాలుగున్నర పదుల వయసులో యువ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీకి వచ్చారు. ఆనాడు ఆయన తొమ్మిదేళ్ళ పాటు తనదైన శైలిలో ఏపీ రాజకీయాలను శాసించారు. సంస్కరణ పధంలో నడిపారు. అయితే 2004లో బాబు ఓడిపోవడంతో పాటు వైఎస్సార్ సంక్షేమ మంత్రాన్ని అందుకుని రెండు సార్లు సీఎం కావడంతో బాబు ఆలోచనలు కూడా మారాయని చెబుతారు

ఇక్కడే బాబు రాంగ్ స్టెప్ వేశారని అంటున్నారు. బాబు తన డెవలప్మెంట్ ని విజన్ ని తన సంస్కరణలను వీడకుండా అదే స్టాండ్ తో ఎన్నికలకు వెళ్తే ఆయనకు ఢోకా ఉండేది కాదని అంటారు. ఇపుడు కూడా జగన్ సంక్షేమం అంటే బాబు అటే వెళ్ళడం చాలా మందికి నచ్చడంలేదు. ప్రత్యేకించి ఏపీ అభివృద్ధి కోరుకునే వారు అంతా కూడా తప్పుపడుతున్నారు. ఇపుడు బాబు తనలోని విజనరీని తీసి జనం ముందు పెడితే తప్పకుండా ఏపీలో అది మంచి ఫలితాలను ఇస్తుందని, విజన్ విషయంలో బాబుకు సాటి పోటీగా ఎవరూ ఉండే చాన్సే లేదని అంటున్నారు.

మొత్తానికి చూస్తే సంక్షేమంతో ఓట్ల పంట పండించుకుని మరోసారి సీఎం కావాలని చూస్తున్న జగన్ కి బాబు మార్క్ విజన్ అడ్డం తగిలితే మాత్రం భారీ షాక్ అనే చెప్పాలి. ఈ రోజుకు ఏపీ ఉన్న పరిస్థితుల్లో కావాల్సింది నగదు బదిలీ పధకాలు కాదు దార్శనీకతతో కూడా పరిపాలనా దక్షత అని అంతా అంటున్నారు. సో బాబు కొత్త గొంతు వినిపిస్తే మాత్రం వైసీపీకి చుక్కలే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.