Begin typing your search above and press return to search.

కొత్త ఎత్తు : 2024లో బాబు సంచలం సృష్టిస్తారా...?

By:  Tupaki Desk   |   22 Jun 2022 10:30 AM GMT
కొత్త ఎత్తు : 2024లో బాబు సంచలం సృష్టిస్తారా...?
X
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలే వేరు అని అంటున్నారు. ఆయన చాణక్య రాజకీయం ఎవరి అంచనాలకు అందనిది. ఇక ఏపీలో జనసేన టీడీపీల మధ్య పొత్తు అసాధ్యం అని కొందరు అనుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ పెట్టిన షరతులకు టీడీపీ తలవొగ్గదు అని కూడా భావించవచ్చు. కానీ చంద్రబాబు ఇపుడు సరికొత్త ఎత్తుగడలో ఉన్నారు. ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేయడానికి రెడీ అని కూడా అంటున్నారు.

జనసేన కోరినట్లుగా అధికారంలో వాటా ఇవ్వడాకికి బాబు చివరి నిముషంలో రెడీ అవుతారు అని చెబుతున్నారు. అదెలా అంటే ఈసారి తాను తప్పుకుని తన కుమారుడు లోకేష్ ని సీఎం ని చేయడం ద్వారా అని అంటున్నారు. అలాగే తనతో మితృత్వం నెరపడానికి సంకేతాలు ఇస్తున్న పవన్ కి కూడా కుర్చీలో చాన్స్ ఇవ్వడానికి బాబు ఒకటి కాదు పది మెట్లు దిగుతారు అని అంటున్నారు.

ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే కనుక కచ్చితంగా అధికారం దక్కదు అన్నది బాబుకు బాగా తెలుసు అని చెబుతున్నారు. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో జనసేనను వదులుకోరని అంటున్నారు. అయితే ఆ మాట ఇపుడు చెప్పకుండా ఎన్నికల ముందే ఆయన తన పదునైన రాజకీయ వ్యూహాన్ని బయటకు తీస్తారని చెబుతున్నారు. ఇక ఎపుడైతే లోకేష్ ని సీఎం చేయాలన్న తలంపు వచ్చిందో అపుడే ఆయన చినబాబుని జనాల్లోకి పంపాలని ప్రజల మద్దతు అతనికి కూడగట్టడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ క్రమంలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి లోకేష్ పాదయాత్ర ఏపీలో స్టార్ట్ అవుతుంది. అది దాదాపు ఏణ్ణర్ధం పైగా సాగనుంది. ఈ యాత్ర లోకేష్ ని కాబోయే సీఎం గా ఫోకస్ చేస్తుంది అని అంటున్నారు. ఈ యాత్ర తరువాత లోకేష్ మీద జనాలకు విశ్లేషకులకు ఉన్న ఆలోచనలు మొత్తం మారుతాయని కూడా ఆశపడుతున్నారు. భావి నాయకుడిగా టీడీపీ సీఎం క్యాండిడేట్ గా లోకేష్ ని అలా ఫోకస్ చేసిన మీదటనే బాబు జనసేనతో పొత్తు మాటను చెబుతారు అని అంటున్నారు.

ఇక బాబు ఆలోచనల్లో ఉన్న దాని మేరకు చూస్తే జనసేనకు అధికారంలో వాటా ఇచ్చేందుకు రెడీ అనే అంటున్నారు. అయితే 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే తొలి చాన్స్ తెలుగుదేశం తీసుకుంటుంది. అలా రెండున్నరేళ్ళ పాటు లోకేష్ సీఎం అయ్యాక మలి విడత చాన్స్ పవన్ కి ఇస్తారని తెలుస్తోంది. ఇక సీట్ల విషయం వస్తే జనసేనకు నలభై దాకా మాత్రమే సీట్లను ఇచ్చి మిగిలినది తాము తీసుకోవాలని టీడీపీ ఆలోచిస్తోంది.

దీనికి జనసేన ఒప్పుకుని తీరుతుందనే భావన అయితే ఉంది అంటున్నారు. అయితే ఈ మొత్తం పొత్తుల ఎత్తుగడలో చంద్రబాబు మాత్రం భారీ త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. ఆయన సీఎం గా ఇక మీదట కనిపించరు. అయితే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వానికి మార్గదర్శిగా ఉంటారు అన్న మాట. అలా లోకేష్ ని సీఎం గా చూసుకోవడంతో పాటు పది కాలాల పాటు టీడీపీని పటిష్టం చేసుకునేలా అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్స్ వుంటాయని అంటున్నారు.

అదే విధంగా పవన్ని సీఎం చేశామన్న పేరిట కాపు సామాజికవర్గాన్ని పూర్తిగా వీలైతే శాశ్వతంగా తమ వైపునకు తిప్పుకునే ఎత్తుగడ కూడా టీడీపీ పెద్దల వద్ద ఉందని అంటున్నారు. ఎన్నాళ్ళుగానో సీఎం పదవి ఆ సామాజికవర్గానికి దక్కలేదని, ఆ కలను టీడీపీ సాకారం చేసింది అని చెప్పుకోవడానికి కూడా ఈ పొత్తు ఉపకరిస్తుంది అని బాబు ఆలోచిస్తున్నారుట. మరి ఇవన్నీ నిజమైతే మాత్రం ఏపీలో వైసీపీకి గడ్డుకాలమే అని చెప్పాలి. అలాగే పవన్ సీఎం కోరిక కూడా నెరవేరడం ఖాయం.