Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా ?

By:  Tupaki Desk   |   7 Nov 2021 7:30 AM GMT
చంద్రబాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా ?
X
పుట్టి పెరిగిన నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ప్రయోగం చేయబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నారు. చంద్రగిరిలో 2009లో టీడీపీ తరఫున రెడ్డి సామాజికవర్గానికి చెందిన రోజా పోటీ చేసినా లెక్కలేదు. ఎందుకంటే అప్పట్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కోసం చివరి నిముషంలో రోజాను నగిరి నుండి చంద్రగిరికి చంద్రబాబు షిఫ్ట్ చేశారు.

కాబట్టి అప్పట్లో రోజా పోటీని పార్టీ నేతలే సీరియస్ గా తీసుకోలేదు. కానీ రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుండి మబ్బు దేవనారాయణరెడ్డి (పెదబ్బ)ని రంగంలోకి దింపాలని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఇదే విషయాన్ని పెద్దబ్బకు చంద్రబాబు చెప్పటం అతను కూడా పోటీకి రెడీఅయిపోవటం అన్నీ జరిగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజనలో తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో కలిసింది.

తిరుపతి రూరల్ మండలంలో మాజీ ఎంఎల్ఏ, పెద్దబ్బ తండ్రి మబ్బు రామిరెడ్డికి మంచి పట్టుంది. ఈ మండలంపై మొదటినుండి రెడ్లదే ఆధిపత్యం. ఇపుడెలాగు ఈ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో కలిసుంది కాబట్టి తనకు బాగా అడ్వాంటేజ్ అవుతుందని పెద్దబ్బ అనుకుంటున్నారు. ఇదే పాయింట్ మీద చంద్రబాబు కూడా పెద్దబ్బను తిరుపతి కాకుండా చంద్రగిరిలో పోటీచేసేట్లు ఒప్పించారు. పెద్దబ్బకు ఆర్ధికంగా పూర్తి మద్దతు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. దాంతో పెద్దబ్బ కూడా చంద్రగిరిలో పోటీకి రెడీ అయిపోయారు.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే వైసీపీ తరపున ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాగా పాతుకుపోయారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలులో చెవిరెడ్డి బాగా యాక్టివ్ గా ఉన్నారు. ప్రధానంగా చెవిరెడ్డికి కలిసొచ్చే అంశం ఏమిటంటే క్యాడర్ తో పాటు జనాలకు బాగా యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడూ జనాల్లోనే తిరుగుతుంటారు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న కాలంలో కూడా కరోనా కిట్లను రెండుసార్లు నియోజకవర్గమంతా సొంతఖర్చుతో పంపిణీ చేశారు.

అలాగే ఆనందయ్య ఆయుర్వేధం మందును నియోజకవర్గంలో పంపిణీ చేశారు. జనాల్లో కానీ క్యాడర్లో కానీ చెవిరెడ్డిపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. ఏ మండలంపైన అయితే పెద్దబ్బ దృష్టి పెట్టారో అదే తిరుపతి రూరల్ మండలంలో చెవిరెడ్డికి కూడా పట్టుంది. ఈ మండలం కాకుండా చంద్రగిరిలోని ఇతర మండలాల్లో కూడా పట్టుంది. మరి ఈ నేపధ్యంలోనే చంద్రబాబు చేస్తున్న రెడ్డి ప్రయోగం సక్సెస్ అవుతుందా ? అనే చర్చ పార్టీలో జరుగుతోంది.