Begin typing your search above and press return to search.

క‌నీసం... తిరుప‌తిలో అయినా.. అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ అవుతారా?

By:  Tupaki Desk   |   29 Oct 2021 2:30 PM GMT
క‌నీసం... తిరుప‌తిలో అయినా.. అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ అవుతారా?
X
టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు.. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు చేశార‌ని అంటున్న దాడికి సంబంధించి ఢిల్లీలోని పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయాల‌ని అనుకున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ల‌కు లేఖ‌లు రాశారు. వారి అప్పాయింట్‌మెంట్ల‌ను కూడా అడిగారు.. అయితే.. ఒక్క రాష్ట్ర‌ప‌తి మాత్ర‌మే ఆయ‌న‌కు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో భారీ బృందంతో వెళ్లి.. రాష్ట్ర‌ప‌తిని క‌లిసి ఏపీ పరిణామాల‌పై బాబు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని, హోం మంత్రి అప్పాయింట్మెంట్‌ల కోసం చూసినా.. వారు ఇవ్వ‌లేదు.

దీంతో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి వెనుదిరిగి వ‌చ్చారు. వాస్త‌వానికి హోం మంత్రిని క‌లిసి.. వ్య‌క్తిగ‌తంగా వైసీపీ స‌ర్కారుపై చంద్ర‌బాబు ఫిర్యాదు చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనుకున్న విధంగా జ‌ర‌గ‌లేదు. దీనిపై వైసీపీ నేత‌ల నుంచి స‌టైర్లు పేలాయి. దీంతో టీడీపీ నేత‌లు మ‌రోప్ర‌క‌ట‌న చేశారు.. అమిత్ షా నుంచి చంద్ర‌బాబుకు పోన్ వ‌చ్చింద‌ని.. తాను క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌డం.. రాగానే కేంద్ర కేబినెట్ భేటీకి హాజ‌రుకావ‌డంతో బాబునుక‌లుసుకోలేక పోయాన‌ని, త్వ‌ర‌లోనే అప్పాయింట్‌మెంట్ ఇస్తాన‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు. అయితే.. ఇది నిజ‌మేనా? అంటూ వైసీపీ నేత‌ల నుంచి మ‌ళ్లీ స‌టైర్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇదిలావుంటే.. అమిత్‌షా వ‌చ్చే నవంబ‌రు 14న తిరుప‌తికి రానున్నారు.

ద‌క్షిణ ప్రాంత కౌన్సిల్ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా శాంతి భ‌ద్ర‌త‌లు, ప్రాంతీయ అభివృద్ధిపై ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు. ఈ స‌మావేశానికి గ‌వ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రులు, ప్ర‌బుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, స‌ల‌మాదారులు.. ఇత‌ర సీనియ‌ర్ అధికారులు పాల్గొంటారు. అదేస‌మ‌యంలో కేవ‌లం ఐదు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు స‌హా పుదుచ్చేరి, అండ‌మాన్ నికోబార్, ల‌క్ష‌ద్వీప్ నుంచి పాల్గొటారు. ఈ స‌మావేశానికి ఏపీ ఆతిథ్యం ఇస్తున్న ద‌గ్గ‌ర నుంచి.. అమిత్ షా ముఖ్య‌మంత్రులు, ఇత‌ర నాయ‌కుల‌తో భేటీ అవుతున్నారు.

ఈ క్ర‌మంలో అదే రోజు రాత్రికి తిరుప‌తిలో అమిత్ షా బ‌స చేయ‌నున్నారు. అనంత‌రం.. శ్రీవారిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉంది. ఇదే స‌మయంలో కొద్దిమంది నేత‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అమిత్‌షా స‌మ‌యం ఇస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. టీడీపీ నేత‌లు ఇటీవ‌ల చెప్పిన దాని ప్ర‌కారం.. అమిత్ షా స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి ఉంటే.. ఆయ‌న ఖ‌చ్చితంగా తిరుప‌తిలో బాబుకు ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇస్తార‌ని అంటున్నారు. అయితే.. అమిత్ అవ‌కాశం ఇస్తారా? అనేది సందేహ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.