Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ?

By:  Tupaki Desk   |   13 Oct 2021 9:30 AM GMT
చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ?
X
ఇపుడిదే అంశంపై కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో ఎలాగైనా పార్టీ జెండాను ఎగరేయాలని చంద్రబాబునాయుడు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగానే పార్టీకి దూరమైన వర్గాలను ఏకం చేయాలని అధినేత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లోనే దేవగుడి నారాయణరెడ్డి, జంబాపురం రమణారెడ్డి వర్గాలను ఏకం చేశారు. రెండువర్గాలు ఏకం అయితే వైసీపీని ఓడించటం పెద్ద విషయం కాదని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావంతో గుండ్లకుంట శివారెడ్డి ఎన్టీయార్ కు గట్టి మద్దతుదారుగా నిలబడ్డారు. ఆయన తర్వాత ఆయన కొడుకు రామసుబ్బారెడ్డి వరుసగా రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత దివంగత వైఎస్సార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున దేవగుడి ఆదినారాయణరెడ్డి వరసగా రెండుసార్లు గెలిచారు. తర్వాత వైఎస్సార్ మరణంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఆది నారాయణరెడ్డి తర్వాత వైసీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ తరపున ఆదినారాయణరెడ్డి గెలిచారు. అయితే చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీలోకి ఫిరాయించటమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. ఎప్పుడైతే వైసీపీ నుండి ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫిరాయించారో ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి టీడీపీలో నుండి వైసీపీలోకి మారిపోయారు. ఇదే సమయంలో టీడీపీలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు లేదని భావించిన ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి మారిపోయారు. దాంతో జమ్మలమడుగులో టీడీపీకి గట్టి నేత లేకుండా పోయింది.

ఇదే సమయంలో ఒకపుడు నియోజకవర్గంలో బాగా యాక్టివ్ గా ఉన్న జంబాపురం రమణారెడ్డిని మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయాలని చంద్రబాబు అనుకున్నారు. అలాగే దేవగుడి నారాయణరెడ్డి కొడుకు దేవగుడి భూపేష్ రెడ్డిని కూడా చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. ఒకేసారి రమణారెడ్డి+భూపేష్ రెడ్డి తో మాట్లాడిన చంద్రబాబు భూపేష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను రమణారెడ్డి అండ్ కో పై ఉంచారు. భూపేష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే రమణారెడ్డి కుటుంబానికి సముచితమైన స్ధానం కల్పిస్తానని కూడా చంద్రబాబు హామీఇచ్చారు. మరి ఈ రెండు కుటుంబాలు ఎంతవరకు కలిసి పనిచేస్తాయో చూడాలి.