Begin typing your search above and press return to search.

హిందూ మ‌హా స‌ముద్రంలో వీటితో చైనాకు ఇబ్బందులేనా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 11:30 PM GMT
హిందూ మ‌హా స‌ముద్రంలో వీటితో చైనాకు ఇబ్బందులేనా?
X
హిందూ మహా స‌ముద్రంలో భార‌త్ భ‌ద్ర‌త‌కు ముప్పు తెచ్చేలా చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వాణిజ్యంలో 40 శాతం హిందూ మ‌హాస‌ముద్రం గుండానే జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో యుద్ధ నౌక‌లు, జ‌లాంత్గ‌రాముల‌ను అంత‌కంత‌కూ పెంచుకుంటూ భార‌త్, అమెరికా ఆధిప‌త్యాన్ని ఈ ప్రాంతంలో దెబ్బ‌తీయాల‌ని చైనా ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇప్ప‌టికే చైనా యుద్ధ నిఘా నౌక శ్రీలంక‌లోని హంబ‌న్‌టొట రేవు ప‌ట్ట‌ణంలో ఉంది. దీనికి ద‌క్షిణ భార‌తదేశంలోని అన్ని విమానాశ్ర‌యాలు, నౌకాశ్ర‌యాలు, అణు విద్యుత్ కేంద్రాల‌పై నిఘా వేయ‌గ‌ల సామ‌ర్థ్యం, వాటి స‌మాచారం సేక‌రించ‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో చైనా చ‌ర్య‌ల‌కు భార‌త్ విరుగుడు చ‌ర్య‌లను చేపట్టింది. అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ-9బీ ప్రిడేట‌ర్ డ్రోన్ల‌ను కొనుగోలు చేయ‌నుంది. మొత్తం 30 ఎంక్యూ-9బీ ప్రిడేట‌ర్ డ్రోన్ల‌ను కొనుగోలు చేయ‌నుంది. ఇందుకు భార‌త క‌రెన్సీలో మొత్తం రూ.300 కోట్ల ఖ‌ర్చవుతుంద‌ని ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన చ‌ర్చ‌లు పురోగ‌తిలో ఉన్నాయ‌ని ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అమెరికా నుంచి ఈ 30 ఎంక్యూ-9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూ మహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు తెలిపాయి. ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ ఆధునిక వెర్షనే ఎంక్యూ-9బీ అని చెబుతున్నారు. ఈ ఏడాది జూలైలో అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా ఉగ్ర‌వాద సంస్థ అగ్ర‌ నేత అల్‌ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌నే కావడం గమనార్హం.

అమెరికాలోని జనరల్ అటామిక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన ఎంక్యూ-9 బీ ప్రిడేటర్ల కోసం అమెరికా, భార‌త్ ప్రభుత్వాల మధ్య ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఆయుధాల శిక్ష‌ణ‌, సాంకేతికత స‌హ‌కారానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని జనరల్ అటామిక్స్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ వివేక్‌ లాల్‌ కూడా ధ్రువీకరించారు.

కాగా ఈ హంటర్‌-కిల్లర్‌ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులను మోసుకెళ్లగలవని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతున్నారు. సరిహ‌ద్దుల్లోనూ, హిందూ మ‌హా స‌ముద్రంలోనూ చైనా ముప్పు పెరుగుతున్న నేప‌థ్యంలో ఎంక్యూ-9బీ ప్రిడేట‌ర్ డ్రోన్ల‌తో చైనా ఆట క‌ట్టించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.