Begin typing your search above and press return to search.
నా సర్కారు విమర్శిస్తే గోర్లు కత్తిరిస్తానంటున్న సీఎం
By: Tupaki Desk | 2 May 2018 4:43 AM GMTబీజేపీ నాయకులెవ్వరూ అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని మోడీ హితబోధ చేసినా వారి తీరు మారడం లేదు. తరుచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతూనే ఉంది. తన ప్రభుత్వాన్ని విమర్శించిన వారి గోర్లు కత్తిరిస్తామని ఆయన వ్యాఖ్యానించిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. తమ ప్రభుత్వాన్ని ఎవరూ ముట్టుకోలేరని, ఒకవేళ అందుకు ప్రయత్నిస్తే వారి గోర్లు కత్తిరిస్తామని బిప్లబ్ దేబ్ పేర్కొంటున్నట్టు ఆ వీడియోలో ఉంది. బీజేపీ నేత - త్రిపుర సీఎం విప్లబ్ దేవ్ రెండు వారాల్లో పలు నిర్హేతుకమైన - వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఈ వ్యాఖ్యలపై అనేక విమర్శలు వెలువడ్డాయి.
మరోవైపు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ గతంలో ఉన్నావ్ ఘటన సమయంలోనూ.. ముగ్గురు బిడ్డల తల్లిపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడతారా..? అంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. తాజాగా సురేంద్ర సింగ్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశంలో లైంగికదాడులు పెరిగిపోవడానికి తల్లిదండ్రులు, మొబైల్ ఫోన్లే కారణమంటూ వ్యాఖ్యానించారు. బలియా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'లైంగికదాడులు జరగడానికి తల్లిదండ్రులే కారణం. మితిమీరిన స్వేచ్ఛ వల్లే పిల్లలు దురలవాట్లకు అలవాటు పడుతున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు కఠిన నిబందనలు విధించాలి. వారిని స్వేచ్ఛగా తిరుగనియ్యకూడదు.' అని అన్నారు. అంతేగాక.. తల్లిదండ్రులు వారి పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని, వాటి వల్లే పిల్లలు లైంగికదాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.