Begin typing your search above and press return to search.

వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు?

By:  Tupaki Desk   |   8 May 2022 3:30 PM GMT
వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు?
X
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి... ప్రస్తుతం చైనా, దక్షిణాఫ్రికా లను గడగడలాడిస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు తన రూపు ను మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో జనాలను ఇప్పటికీ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వల్ల చాలా మంది ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం అనారోగ్య సమస్యలు కాకుండా.. ఆర్థికంగా కూడా బాగా చితికి పోయారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల వైరస్ సంక్రమణ పై జార్జ్ టౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత లతో అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లో కి తరలి రావడం... దాంతో వైరస్ లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు నివేదిక లో వెల్లడైంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మధ్యంతర జీవులకు అక్కడి నుంచి ప్రజలకు వైరస్ సోకే పరిస్థితులకు దారి తీస్తాయని జార్జ్ టౌన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ కార్ల్ సన్ పేర్కొన్నారు.

ఎబోలా, కరోనా వంటి వైరస్ లు కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి ఇవి అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్నారు. దాంతో మూలాలను గుర్తించలేని విధంగా మారడంతో పాటు వన్య ప్రాణుల నుంచి మానవులలోకి వైరస్ లు ప్రవేశించేందుకు వాతావరణ మార్పులు కారణం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వేడి వాతావరణం ఉన్న కారణంగా ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలు కావచ్చిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూతాపం తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల పెరుగుదల గబ్బిలాలపై ప్రభావం చూపించ వచ్చని వివరిస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లే సామర్థ్యం కారణంగా వైరస్ ల విస్తరణ మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. అందుకే వేసవి కాసం తగ్గే వరకు ఎక్కువగా బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎండల వల్ల వైరస్ ల వ్యాప్తి కాకుండా ఉష్ణ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ముఖ్యంగా అనేక ఇతర సమస్యలతో బాధపడేవారికి అందులోనూ వృద్ధులు, పిల్లలను ఎక్కువగా జనాలు ఉన్న చోట తిప్పకూడదని సూచిస్తున్నారు. వేసవి కాలం పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉంటేనే ప్రాణాలు రక్షించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలని... పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, సీజనల్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అలాగే రెండు డోసుల కరోనా టీకాలతో పాటు బూస్టర్ డోసును కూడా తీసుకోవాలని పేర్కొంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఎండలో బయటకు రాకూడదని చెబుతున్నారు.