Begin typing your search above and press return to search.

జానారెడ్డి తో కాంగ్రెస్ 'ఆకర్ష్' ఫలిస్తుందా?

By:  Tupaki Desk   |   24 April 2022 12:30 AM GMT
జానారెడ్డి తో కాంగ్రెస్ ఆకర్ష్ ఫలిస్తుందా?
X
పెద్దలు జానారెడ్డిని పెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. వచ్చేసారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో కార్యాచరణ రూపొందింస్తోంది. ముఖ్యంగా పార్టీలో వెలుగు వెలిగిన సీనియర్ ఉద్దండ పిండాలను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు యోచిస్తోంది. వివిధ కారణాలతో గతంలో పార్టీని వీడిన వారిని.. ఇతర పార్టీల్లో ఆసక్తి ఉన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ దురంధరుడు అయిన జానారెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. జానారెడ్డి చైర్మన్ గా చేరికలపై ప్రత్యేక కమిటీ వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

వచ్చేనెల 6,7వ తేదీల్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన సమక్షంలో కొందరు చేరికలపై స్పష్టత వచ్చేలా వీరు ప్రయత్నాలు చేయనున్నారు.రాహుల్ సమక్షంలో చేరికలు జరిగేలా చర్చలు జరుపుతున్నారు.

ఇప్పటికే పీసీసీ చీఫ్ అయినత ర్వాత రేవంత్ రెడ్డి సీనియర్లు, పాత కాపులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు సహకరించాలని అందరి ఇళ్లకు వెళ్లి మరీ రాజీ చేసుకున్నారు. కొందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న సీనియర్ నేతలు ధర్మపురి శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ లను పార్టీలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. మహబూబ్ నగర్ లో కొందరు నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. ప్రతి జిల్లాలోని పాత కాంగ్రెస్ నేతలను కలిసి మరీ ఆహ్వానించారు. ఈటల రాజేందర్ ను సైతం కాంగ్రెస్ లోకి రావాలని మంతనాలు జరిపారు.

అయితే జిల్లాల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు పాత వారి రాకను అడ్డుకుంటున్నారని.. చేరికలను కాకుండా లాబీయింగ్ చేస్తున్నారని తేలింది. దీంతో రాహుల్ గాంధీ సీరియస్ అయ్యాడని.. పార్టీలో చేరేవారిని అడ్డుకోవద్దని సూచించారట.. ఈ సమస్యను అధిగమించేందుకు అధిష్టానం ఇప్పుడు ప్రత్యేక కమిటీ వేసింది.

ఈ కమిటీ ఇప్పుడు రంగంలోకి దిగి రాహుల్ సభలోపు పార్టీ నేతలతో చర్చలు జరిపి వారిని కాంగ్రెస్ లోకి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది. రాహుల్ సభలో వారిని కాంగ్రెస్ లో చేర్పించడానికి చర్చలు జరుపుతోందట.. ప్రస్తుతం ఖమ్మంలో ఇద్దరు అసంతృప్తులు.. మహబూబ్ నగర్ లో ఒకరిద్దరు నేతలు.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి వీరు వస్తారా? రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారా? అన్నది వేచిచూడాలి.