Begin typing your search above and press return to search.

'ప్ర‌గ‌తి భ‌వ‌న్' మీద త‌మ్ముళ్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   11 April 2017 3:21 AM GMT
ప్ర‌గ‌తి భ‌వ‌న్ మీద త‌మ్ముళ్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓప‌క్క తెలంగాణ‌లో చ‌చ్చిన పాముతో పార్టీని పోలుస్తున్న‌వేళ‌.. కాస్త ఆల‌స్యంగా తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు రియాక్ట్ అయ్యారు. పార్టీ మండ‌ల‌.. ప‌ట్ట‌ణ‌.. డివిజ‌న్‌.. మున్సిప‌ల్ స్థాయి ఎన్నిక‌ల అధికారుల‌కు పార్టీలో శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత రేవంత్ రెడ్డి త‌దిత‌రులు మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఎల్‌. ర‌మ‌ణ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌తో పాటు.. సంచ‌ల‌నంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంతోముచ్చ‌ట‌ప‌డి క‌ట్టుకున్న సీఎం అధికారిక నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను తాము కానీ అధికారంలోకి వ‌స్తే.. ఆసుప‌త్రిగా మార్చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను పేద‌ల సేవ కోసం వినియోగిస్తామ‌ని చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కుటుంబ పెత్తాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడాలంటూ రెగ్యుల‌ర్ డైలాగులు చెప్పిన ర‌మ‌ణ మాట‌లు విన్నంత‌నే.. దాదాపు ఆరేడేళ్ల క్రితం దివంగ‌త త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అమ్మ అలియాస్ జ‌య‌ల‌లిత మాట‌లు చ‌ప్పున గుర్తుకు రావ‌టం ఖాయం. డీఎంకే అధినేత క‌రుణానిధి ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు సుమారు రూ.1100 కోట్ల వ్య‌యంతో నూత‌న అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించారు. దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు జ‌య‌ల‌లిత‌.
తాను కానీ అధికారంలోకి వ‌చ్చిన‌వెంట‌నే.. ఆధునాత‌న అసెంబ్లీ భ‌వ‌నాన్ని సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా మార్చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. ఇందుకు త‌గ్గ‌ట్లే.. జ‌య‌ల‌లిత ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన అనంత‌రం.. సుమారు 2011 స‌మ‌యంలో క‌రుణానిధి క‌ల‌ల అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఆసుప‌త్రిగా మార్చే ద‌స్త్రంపై సంత‌కం చేసేశారు.

కోట్లాది రూపాయిల ఖ‌ర్చుతో ముఖ్య‌మంత్రి నివాసం కోసం నిర్మించిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ పై చాలానే విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. వీటిని స‌మ‌ర్థంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే స‌త్తా తెలంగాణ రాష్ట్ర నేత‌ల్లో లేక‌పోవ‌టం ఒక దుర‌దృష్ట‌క‌ర‌మైన ప‌రిణామంగా చెప్పాలి. ఇలాంటి వేళ‌.. ర‌మ‌ణ మాట్లాడుతూ.. అమ్మ త‌ర‌హాలో శ‌ప‌ధం చేయ‌టం బాగానే ఉన్నా.. అమ్మ మాదిరి ప్ర‌జ‌ల్లో త‌మ‌కు ప‌ట్టు లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. నాడు అమ్మ చెప్పిన‌ట్లే చేశారు. మ‌రీ రోజున తెలంగాణ త‌మ్ముళ్లు చెప్పిన మాట‌ల్ని స‌మీప భ‌విష్య‌త్తులో అలా చేసే అవ‌కాశం ఉందా? అంటే డౌట్ అని చెప్ప‌క త‌ప్పుదు. ఇదిలా ఉంటే.. పార్టీ సీమ‌ట‌పాకాయ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ‌ను అప్పుల తెలంగాణ‌గా మార్చేశార‌ని మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీని చ‌చ్చిన‌పాముతో హ‌రీశ్ అంటున్నార‌ని.. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఆయ‌న ప‌రిస్థితి అంత‌కంటే అధ్వానంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. గుంటూరు.. పుణె.. అమెరికాలో చ‌దివిన కేటీఆర్ కు స్థానిక‌త లేనందున తెలంగాణ‌లో ఏ ఉద్యోగానికి అర్హ‌త లేద‌న్నారు. నిజ‌మే.. రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లుగా ఉద్యోగం చేయ‌టానికి కేటీఆర్‌కు స్థానిక‌త లేకున్నా.. స్థానిక‌త‌తో ఉద్యోగం చేసే వారంద‌రిని టోకుగా ఎక్కి తొక్కే ప‌వ‌ర్ ఉందిగా? అది స‌రిపోదా?