Begin typing your search above and press return to search.

మ‌హా సంక్షోభం మ‌న‌కూ వ‌స్తుందా?

By:  Tupaki Desk   |   23 Jun 2022 4:24 AM GMT
మ‌హా సంక్షోభం మ‌న‌కూ వ‌స్తుందా?
X
తెలుగు రాష్ట్రాల‌లో మ‌హా రాష్ట్ర‌లో చోటు చేసుకున్న విధంగా సంక్షోభం వ‌స్తుందా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే సంకీర్ణ రాజ‌కీయాలు లేనందున ఇప్ప‌టికిప్పుడు ఈ త‌ర‌హా సంక్షోభాలు రావు కానీ మున్ముందు మాత్రం ఇదేవిధంగా రాజ‌కీయం ఉంటుంద‌ని చెప్ప‌లేం. ప్ర‌స్తుతం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న వైసీపీ కానీ టీఆర్ఎస్ కానీ అలాంటి భయాల్లో లేవు. కానీ ప్ర‌జా వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉండి, ఒక‌వేళ అటువంటి ప‌రిణామాలు ఏమ‌యినా జ‌రిగితే అప్పుడు మాత్రం త‌ల‌నొప్పులు అధినాయ‌క‌త్వాల‌కు త‌ప్ప‌వు.

ప్ర‌స్తుతం వైసీపీ బ‌లంగానే ఉంది. రేప‌టి వేళ ఎక్కువ సీట్లు తెచ్చుకునే స్థితిలో తెలుగుదేశం ఉంటే, అప్పుడు జ‌న‌సేన కూడా చెప్పుకోద‌గ్గ స్థానాలు గెలుచుకుంటే హంగ్ ఏర్ప‌డ‌వ‌చ్చు. ఆ విధంగా ఏర్ప‌డినా కూడా క్యాంపు రాజ‌కీయాలు అయితే పెద్ద‌గా జ‌రిగే ఛాన్స్ లేదు. ఇప్ప‌టికిప్పుడు రెండు పార్టీల‌లోనూ బల‌మైన నాయ‌కులెవ్వ‌రూ అధినాయ‌క‌త్వాల‌ను కాద‌ని ఏక్ నాథ్ షిండే మాదిరిగా రాజ‌కీయం న‌డ‌ప‌రు.

న‌డ‌ప‌లేరు కూడా ! కాస్తో కూస్తో వైసీపీలో జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర బంధువులే అసంతృప్తితో ఉన్నా, వారు కూడా ఆయ‌న్ను కాద‌ని వేరు కుంప‌ట్లు పెట్టి, రాజకీయాల్లో ప్ర‌కాశించాల‌ని అనుకోవ‌డం లేదు. క‌నుక ఆ ఛాన్స్ వైసీపీకీ లేదు.. అదేవిధంగా టీడీపీకీ లేదు. టీడీపీలో కూడా బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు.బ‌య‌ట‌కు వెళ్లి పార్టీలు పెట్టారు కూడా ! వారిలో కేసీఆర్ త‌ప్ప వేరెవ్వ‌రూ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయారు.

దేవెంద‌ర్ గౌడ్ లాంటి వారు పార్టీ పెట్టినా నో యూజ్ అని తేలిపోయింది. అసలు తెలుగు దేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి లో హ‌రికృష్ణ కూడా అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి పెద్ద‌గా పేరు తెచ్చుకోలేక‌పోయారు.

ల‌క్ష్మీ పార్వ‌తి కూడా పార్టీ పెట్టారు కానీ అది కూడా నిల‌దొక్కుకోలేక‌పోయారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (లక్ష్మీపార్వ‌తి) కూడా పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయారు. కాల గ‌తిలో టీడీపీ నుంచి మ‌రో పార్టీ వ‌చ్చే ఛాన్స్ అయితే లేదు.

ఇక వైసీపీ నుంచి వెళ్లిపోయి ష‌ర్మిల మాత్రం తెలంగాణ కేంద్రంగా వైఎస్సార్టీపీ పేరిట రాజ‌కీయం న‌డుపుతున్నారు. కనుక ఈ పార్టీ ఆంధ్రాలో ఉన్న వైసీపీకి పోటీ రాదు. కాదు కూడా ! క‌నుక మ‌హారాష్ట్ర త‌ర‌హా సంక్షోభాలు ఆశించ‌డమే త‌ప్పు ! ఉన్న‌మేర‌కు ఆంధ్రులు కానీ అటు తెలంగాణ ప్ర‌జ‌లు కానీ స్ప‌ష్టంగా ఏదో ఒక పార్టీకే ప‌ట్టం క‌ట్టిన వైనాలే అధికం. 2009లో కూడా పాస్ మార్కుల‌తో గ‌ట్టెక్కిన వైఎస్సార్ కు మాత్రం అప్ప‌ట్లో ప్ర‌జా రాజ్యం పార్టీ సాయం అవ‌స‌రం అయింది. మ‌రి ! ఈసారి జ‌గ‌న్ కు అలాంటి సాయం అవ‌సరం అవుతుందో లేదో చూడాలిక‌.