Begin typing your search above and press return to search.

ఈసారైనా 'దాడి' పాచిక పారేనా?

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:30 AM GMT
ఈసారైనా దాడి పాచిక పారేనా?
X
దాడి వీరభద్రరావు పరిచయం అక్కర్లేని పేరు.. టీడీపీ తరఫున అనకాపల్లి నుంచి పలుమార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోం శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఆయనకు ఉంది. మంచి విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి ఉన్న నేతగానూ పేరు గడించారు.

అయితే కీలక సమయాల్లో అంటే వైసీపీ గెలుస్తుందనుకున్న టైమ్‌లో టీడీపీలో, టీడీపీ గెలుస్తుందనుకున్న టైములో వైసీపీలో ఉండటం.. ఇలా పార్టీలు మారుస్తుండటం, తనకు బదులుగా తన కుమారుడిని రాజకీయాల్లో దింపడం వంటి పొరపాట్లతో గత 20 ఏళ్లుగా దాడి వీరభద్రరావుకు అస్సలు కలసి రావడం లేదు. 1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు దాడి వీరభ్రదరావు అనకాపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో అయితే ఏకంగా మూడో స్థానంలో నిలిచారు.

వాస్తవానికి అనకాపల్లిలో కాపులు, గవరలదే ఆధిపత్యం. దేవాంగులు (చేనేత) కూడా బాగానే ఉన్నారు. అయితే రాజకీయంగా మాత్రం కాపులు, గవరలే ఆధిపత్యం. దాడి వీరభద్రరావు గవర సామాజికవర్గానికి చెందినవారు.

దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. తన కుమారుడైన దాడి రత్నాకర్‌కు అనకాపల్లి సీటు ఆశించారు. అయితే జగన్‌.. విశాఖ పశ్చిమ సీటును రత్నాకర్‌కు కేటాయించారు. అయితే రత్నాకర్‌ ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో సీటు దక్కలేదు. పలు నామినేటెడ్‌ పదవులను ఆఫర్‌ చేసినా తిరస్కరించారు. ఈసారి అనకాపల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.

అయితే అనకాపల్లిలో గుడివాడ అమర్‌నాథ్‌ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. పరిశ్రమలు, ఐటీ మంత్రిగానూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ తరఫున గట్టి వాయిస్‌ వినిపించగల నేతల్లో అమర్‌నాథ్‌ ఒకరు. ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను విమర్శించడంలో అమర్‌నాథ్‌ ముందుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమర్‌నాథ్‌కు విరుద్ధంగా జగన్‌ అక్కడ ఏమీ చేయగల పరిస్థితిలో లేరు.

అయితే గుడివాడ అమర్‌నాథ్‌ వచ్చే ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ కూడా కాపులదే డామినేషన్‌. అనకాపల్లిలో ఈసారి జనసేన ప్రభావం గట్టిగా ఉండే అవకాశం కనిపిస్తుండటం, అమర్‌నాథ్‌ను ఓడించడానికి జనసేన పట్టుదలగా ఉండటంతో ముందు జాగ్రత్తగా అనకాపల్లిని ఖాళీ చేసే యోచనలో ఉన్నారు.. అమర్‌నాథ్‌. అందులోనూ 2009లో అనకాపల్లిలో చిరంజీవి ప్రజారాజ్యం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావు ఆశలు పెట్టుకున్నారు. గుడివాడ అమర్‌నాథ్‌ యలమంచిలి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే అనకాపల్లి నుంచి తాను లేదా తన కుమారుడు పోటీ చేయాలని దాడి వీరభద్రరావు ఆశిస్తున్నారు.

మరోవైపు ఇక్కడ టీడీపీ సైతం బలంగానే ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పీలా గోవింద్‌ సత్యనారాయణపైన ప్రజల్లో మంచి ఇమేజ్‌ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావుకు ఈసారి సీటు దక్కినా గెలుపు మాత్రం కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.