Begin typing your search above and press return to search.

ధర్మానకు మంత్రి పదవి రాదా... ?

By:  Tupaki Desk   |   6 Nov 2021 6:30 AM GMT
ధర్మానకు  మంత్రి పదవి రాదా... ?
X
ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ నేతగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని చెబుతారు. ఆయన ఏ సబ్జెక్ట్ మీద అయిన అనర్గళంగా మాట్లాడుతారు. ఆయన గణాంకాలతో సహా వివరాలు సభ ముందు ఉంచడంలో సిద్ధహస్తుడు. ఆయన ప్రసంగాలు అందుకే ఉర్రూతలూగిస్తాయి. ఇక మాస్ పల్స్ బాగా తెలిసిన నేత. దాంతో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. యువకుడిగా ఉన్న టైమ్ లోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి క్యాబినేట్ లో మంత్రిగా పనిచేసిన ప్రసాదరావు ఆ తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డి దగ్గరా పనిచేశారు. వైఎస్సార్ కి ఆయన బహు ఇష్టుడు. వైఎస్సార్ ఆయనకు పలు కీలకమైన శాఖలు ఇచ్చి గౌరవించారు.

అయితే వైఎస్ జగన్ మాత్రం ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన చాలా అసంతృప్తికి లోనయ్యారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయన అన్న అయిన క్రిష్ణదాస్ కి ఉప ముఖ్యమంత్రి కీలకమైన రెవిన్యూ శాఖను ఇచ్చి జగన్ గౌరవించారు. రెండున్నరేళ్ల కాలపరిమితి పూర్తి కావడంతో క్రిష్ణ దాస్ ని తప్పిస్తారు అన్న టాక్ ఉంది. దానికి బదులుగా ప్రసాదరావుకు ఈసారి చాన్స్ తప్పనిసరిగా వస్తుందని అంతా ఊహిస్తున్నారు. అయితే వైసీపీ హై కమాండ్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయట.

ప్రసాదరావును పూర్తిగా పార్టీ సేవలకే వినియోగించుకోవాలని చూస్తున్నారుట. ఉత్తరాంధ్రా జిల్లాల్లో వెలమ సామాజిక వర్గం అధికంగా ఉంది. పైగా టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా అదే వర్గానికి చెందిన వారు. ఇక ఉత్తరాంధ్రాలో టీడీపీకి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సైకిల్ కి పంక్చర్ చేసిన కూడా 2024 ఎన్నికల్లో మళ్ళీ పుంజుకుంటుంది అన్న అంచనాలూ ఉన్నాయి. దాంతో ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఆలోచనతో జగన్ ఉన్నారట. అచ్చెన్నకు ధీటైన నేతగా అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావును భావించి ఆయనను ముందుంచి పార్టీ ఉత్తరాంధ్రా పగ్గాలు అప్పగించాలని జగన్ చూస్తున్నారుట.

విశాఖ, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లలో వైసీపీని విజయపధాన నడిపించాల్సిన బాధ్యతలను ప్రసాదరావుకే అప్పగించాలని జగన్ యోచిస్తున్నాట్లుగా సమాచారం. అంటే ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ ఇంచార్జి అవుతారు అన్న మాట. వచ్చే ఎన్నికలు వైసీపీకి అతి ముఖ్యం కావడంతో వ్యూహాలలో ఎత్తులలో దిట్ట అయిన ప్రసాదరావు సేవలను అలా ఉపయోగించుకోవాలని జగన్ చూస్తున్నారుట. అయితే ఇప్పటికే కాబోయే మంత్రిని తానే అని ప్రసాదరావు ధీమాగా ఉన్నారు. ఆయన అనుచర వర్గం కూడా మంత్రి మీర అంటోంది. ఈ టైమ్ లో పార్టీ బాధ్యతలు అంటే ప్రసాదరావు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. ఆయన కనుక నో అంటే మాత్రం ఉత్తరాంధ్రా వైసీపీ రాజకీయాలలో సమీకరణలు కూడా మారిపోతాయి మరి. ఏది ఏమైనా ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కదు అన్నది ఇప్పటికైతే వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.