Begin typing your search above and press return to search.

ఏపీ 'దిశ' అమలవుతుందా? లేదా? అభ్యంతరాలేంటి?

By:  Tupaki Desk   |   2 Dec 2021 6:30 AM GMT
ఏపీ దిశ అమలవుతుందా? లేదా? అభ్యంతరాలేంటి?
X
ఏపీలోని జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ బిల్లు ముందుకు సాగేలా కనిపించడం లేదు. హైదరాబాద్ లో దిశ హత్యోదంతం తర్వాత జగన్ సర్కార్ అసెంబ్లీలో ఆడకూతుళ్ల భద్రతకు ఈ చట్టం చేసింది. దిశ బిల్లును ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది. అనంతరం కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనపై రాజ్యసభలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీలు అడిగిన ప్రశ్నపై స్పందించిన కేంద్రం ప్రస్తుతం ‘దిశ’ బిల్లులు ఎక్కడ ఉన్నాయో చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం వీటి ఆమోదం కోసం మరి కొన్నాళ్లు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది.

ఏపీ ప్రభుత్వం పంపిన దిశ బిల్లులు ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో ఉన్నాయని.. న్యాయసలహా కోసం వీటిని పంపినట్లు కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. అలాగే న్యాయశాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం వివరణ కోరినట్లు వెల్లడించింది.

ఈ వివరణ రాగానే రాష్ట్రపతికి పంపుతామని కూడా తెలిపింది. దీంతో కేంద్రం అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరంగా ఇవ్వగలిగితే దిశ బిల్లులు రాష్ట్రపతికి చేరనున్నాయి.కాబట్టి కేంద్రం దిశ బిల్లుల వ్యవహారాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టినట్టైంది. నిజానికి దిశ బిల్లులను గతంలో ఓసారి ఆమోదించి పంపింది ఏపీ ప్రభుత్వం. వాటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. అయితే కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

దీంతో ‘దిశ’ చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అనంతరం ఈ ఏడాది మరోసారి అసెంబ్లీలో మార్పులు చేసి ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్రానికి పంపినా ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. పార్లమెంట్ లో ఎంపీలు ప్రశ్నలు అడిగితే పరిశీలనలో ఉందని చెబుతోంది.

ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు పంపామని కేంద్రం దాటవేస్తోంది. రాష్ట్రం సరైన వివరణ ఇస్తే రాష్ట్రపతికి ఈ బిల్లును పంపుతామని చెబుతోంది. దీంతో దిశపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.