Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లో కర్నూలుకు విమానంలో వెళ్లొచ్చు బాస్

By:  Tupaki Desk   |   25 March 2021 4:39 AM GMT
మూడు రోజుల్లో కర్నూలుకు విమానంలో వెళ్లొచ్చు బాస్
X
చిరకాల కల నెరవేరనుంది. ఏళ్లకు పైబడిన స్వప్నం సాకారం కానుంది. రాయలసీమ ముఖద్వారంగా అభివర్ణించే కర్నూలుకు నేరుగా విమానంలో వెళ్లే కల మరో మూడు రోజుల్లో నిజం కానుంది. కర్నూలు పట్టణానికి సమీపంలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయంలో కొన్ని రోజుల క్రితం నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినా.. అధికారికంగా ఈ రోజు (గురువారం) ఎయిర్ పోర్టునుప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

మరో మూడు రోజుల్లో (మార్చి 28 నుంచి) ప్రయాణికులు నేరుగా కర్నూలుకు విమానాల ద్వారా చేరుకోనున్నారు. ఈ ఉదయం (గురువారం) ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఆయన తాడేపల్లికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 28 నుంచి విశాఖపట్నం.. చెన్నై.. బెంగళూరు నుంచి కర్నూలుకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ విమాన సర్వీసుల్ని ప్రారంభించటానికి డీజీసీఏ పర్మిషన్ తీసుకుంది.

2వేల మీటర్ల పొడవు.. 30 మీటర్ల వెడల్పుతో ఇక్కడి రన్ వే ను డెవలప్ చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్ తో పాటు.. అన్ని రకాల మౌలిక వసతుల్ని కల్పించారు. కర్నూలుకు దగ్గరగా ఉండే హైదరాబాద్ నుంచి మాత్రం విమాన సర్వీసులు నిర్వహించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో మూడు గంటలు.. ప్రైవేటు కారులో మూడున్నర గంటల్లోపే చేరుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సర్వీసును ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు.