Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంలో దోపిడీ.. ఏ రేంజ్‌ లో అంటే.. నివ్వెర పోవ‌డం ప్ర‌జ‌ల వంతు..!

By:  Tupaki Desk   |   26 July 2019 11:36 AM GMT
పోల‌వ‌రంలో దోపిడీ.. ఏ రేంజ్‌ లో అంటే.. నివ్వెర పోవ‌డం ప్ర‌జ‌ల వంతు..!
X
పోల‌వ‌రం. ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి. సాగు, తాగు నీటి రంగాల‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో గ‌త ప్ర‌భుత్వం దోపిడీ చేసింద‌ని, అయిన వారికి కాంట్రాక్టుల రూపంలో ప్ర‌జాధ‌నాన్ని దోచిపెట్టింద‌ని గ‌తంలో విప‌క్షం గా ఉన్న వైసీపీ విమ‌ర్శ‌లు చేసింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అదికారంలోకి వ‌చ్చిన వెంటనే పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ‌కు ఆదేశించింది. రిటైర్ట్ ఇంజ‌నీర్ల బృందంతో పోల‌వ‌రం ప్రాజెక్టు అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించిన జ‌గ‌న్ స‌ర్కారు ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల అసెంబ్లీలోనూ వెల్ల‌డించారు. తాము పోలవ‌రం అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని చెప్పారు.

విచార‌ణ క‌మిటీ బృందం దీనికి సంబంధించిన నివేదిక‌ను ప‌దిహేను రోజుల్లోనే ఇస్తుంద‌ని, అది రాగానే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న అసెంబ్లీ సాక్షిగా హెచ్చ‌రించారు. అనుకున్న విధంగా ఈ వారంలో నిపుణుల బృందం అన్ని రూపాల్లోనూ పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను వెలికి తీసింది. దాదాపు 3100 కోట్ల మేర‌కు అవినీతి జ‌రిగింద‌ని, మొబెలైజ్డ్ అడ్వాన్సులు, ముంద‌స్తు చెల్లింపుల ద్వారా కాంట్రాక్ట‌ర్లు పండగ చేసుకున్నారని స్ప‌ష్టం చేసింది.త‌ద్వారా అధికార ప‌క్షం భారీ ఎత్తున ముడుపులు స్వీక‌రించింద‌ని త‌మ నివేదిక‌లో స్ప‌ష్టం చేశారు.

ఈ వారం ప్రారంభంలో నిపుణుల క‌మిటీ త‌మ నివేదిక‌ను జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు స‌మ‌ర్పించింది. గ‌త తెలుగు దేశం ప్ర‌భుత్వం ఈపీసీకి సంబంధించిన అన్ని నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కింద‌ని క‌మిటీ త‌న నివేదిక‌లో పేర్కొంది. ముఖ్యంగా హెడ్ వ‌ర్క్స్ విష‌యంలో కాంట్రాక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం దోచిపెట్టింది. అదేవిధంగా పోల‌వ‌రం, ఎడ‌మ‌, కుడి కాల్వ‌ల విష‌యంలోనూ కాంట్రాక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం దోచిపెట్టింది. అదేవిధంగా భారీ ఎత్తున అడ్వాన్సులు కూడా చెల్లించింది. పోల‌వరం జ‌ల‌ విద్యుత్ కు సంబంధించి కూడా భూమిని అప్ప‌గించ‌కుండానే నిధులు ముట్ట‌జెప్పిన‌ట్టు క‌మిటీ గుర్తించింది.

హెడ్ వ‌ర్క్ విష‌యంలో కాంట్రాక్ట‌ర్ల‌కు రూ.1559.65 కోట్ల‌ను ముంద‌స్తు చెల్లింపులు చేశారు. అదేవిధంగా 787.20 కోట్ల‌ను హైడ‌ల్ ప‌వ‌ర్ కోసం ఇచ్చారు. ఇక‌, ఎడ‌మ‌ కాల్వ‌కు రూ.492.94 కోట్లు, కుడి కాల్వ‌కు రూ.233.98 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో దోచుకున్న ప్ర‌జాధ‌నాన్ని రెవెన్యూ రిక‌వ‌రీ చ‌ట్టం కింద రాబ‌ట్టాల‌ని నిపుణుల క‌మిటీ ప్ర‌భుత్వానికి సూచించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూసుకుంటే.. ఈ ప‌రిణామం.. చంద్ర‌బాబు అండ్ పార్టీని బోనులో ఇరికించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.