Begin typing your search above and press return to search.

తెలంగాణ కమల దళపతి: లక్ష్మణుడా.. సంజయుడా

By:  Tupaki Desk   |   21 Feb 2020 2:30 PM GMT
తెలంగాణ కమల దళపతి: లక్ష్మణుడా.. సంజయుడా
X
అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగి 2024లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలంగాణ బీజేపీ ఏనాటి నుంచో చెబుతోంది. దీనికి లోక్ సభ ఫలితాలు ఆ దిశగా మార్గం చూపగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా ఆ పార్టీకి ఆశలు రేపాయి. ఈ క్రమంలోనే పార్టీని పటిష్టం చేయడానికి, బలం పెరగడానికి త్వరలోనే పార్టీకి కొత్త సారథిని నియమించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడి మార్పుపై కసరత్తు సాగుతుంది. అయితే ఈసారి పక్కాగా కొత్త కార్యవర్గం ఏర్పాటుచేస్తారని తెలుస్తోంది. దీనికి మాజీ గవర్నర్, పార్టీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్ రావు చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే అధ్యక్షుడిగా లక్ష్మణుడా.. సంజయుడా లేదా అరుణమ్మ అనే చర్చ సాగుతోంది.

పార్టీలో సీనియర్ నాయకుడిగా డాక్టర్ కె.లక్ష్మణ్ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మళ్లొకసారి ఆయన పదవీకాలం పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీకి యువ రక్తం కావాలని, జోష్ మీదున్న యువ నాయకుడు అయితే పార్టీ బలోపేతం అవుతుందనే మాట వినిపిస్తోంది. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక సీటు ఎక్కువ పొంది మొత్తం 4 ఎంపీ సీట్లు గెలవడంతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పడానికి బలం చేకూరింది. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ను కూడా అధ్యక్షుడిగా చేయాలని ప్రధానంగా యువ నాయకులు కోరుతున్నారు.

టీఆర్ఎస్ బలంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో ఒంటిచేత్తో గెలిచిన బండి సంజయ్ పక్కా హిందూత్వ వాది. దూకుడుతనం.. వాక్ఫటిమ తదితర లక్షణాలు ఉండడం తో బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఉత్తర తెలంగాణ నాయకులు కోరుతున్నారు. అయితే గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వ మార్పు విషయమై స్పందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరినీ ఎన్నుకుంటారనే విషయమై మీడియా ప్రశ్నించింది. పార్టీకి డైనమిక్ యంగ్ నాయకుడు బండి సంజయ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆయన ఎంపీగా ఉండడంతో అధ్యక్షుడు అయితే పార్టీకి అంత సమయం కేటాయిస్తాడా? రాష్ట్రమంతా తిరుగుతాడ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే లక్ష్మణ్ అయితే పార్టీని నడిపించగలడు.. పార్టీని విస్తృత చేసే కార్యక్రమాలు చేయగలడు అని చెప్పారు. కానీ వీరు అవుతారు అని మాత్రం ఒక్క పేరు చెప్పలేదు. యువరక్తం, హిందూత్వం అంటే సంజయ్ వైపు.. పార్టీ బలోపేతం, సీనియార్టీ అంటే లక్ష్మణ్ కు అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పదవికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ కూడా పోటీ పడుతున్నారు.

అయితే ఈ పార్టీలో ఇతర పార్టీల మాదిరిగా సామాజిక సమీకరణాలు పెద్దగా పట్టించుకోరు. కేవలం హిందూత్వ, పార్టీలో వారి స్థాయి, వారి గుణగణాలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. మరి వీటన్నిటి నేపథ్యం లో అధ్యక్ష పదవికి లక్ష్మణ్, సంజయ్ మధ్యనే పోటీ సాగుతుంది. ఏది ఏమున్నా పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం వెల్లడిస్తుంది.