Begin typing your search above and press return to search.

అక్కడ నుంచే రఘురామ ఫ్యూచరేంటో చెప్పనున్న జగన్...?

By:  Tupaki Desk   |   14 Oct 2022 8:47 AM GMT
అక్కడ నుంచే రఘురామ ఫ్యూచరేంటో చెప్పనున్న జగన్...?
X
వైసీపీ ఎంపీలలో రెబెల్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు నర్సాపురం ఎంపీ రఘురామరాజు అనే. ఆయన వైసీపీ తరఫున నెగ్గిన అయిదారు నెలల వ్యవధిలోనే జగన్ నుంచి దూరమైపోయారు. దీనికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఏపీ రాజకీయాలలో గత మూడేళ్లుగా జగన్ తో ఢీ అంటే ఢీ అంటూ వచ్చిన నేత రఘురామ రాజు ఒక్కరే బహుశా కనిపిస్తారు. చూడబోతే మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు జరగబోతున్నాయి.

సొంత పార్టీ అధినాయకత్వం మీద దారుణమైన విమర్శలు చేసినా కూడా రఘురామ ఎంపీ సీటుని ఇంచు కూడా వైసీపీ అధినాయకత్వం కదల్చలేకపోయింది. ఆయన మీద అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి ప్రత్యేక ఫ్లైట్ కట్టుకుని కరోనా టైమ్ లో వెళ్ళి స్పీకర్ ని కలసినా ఆ దిశగా రెండేళ్ళు పైదాటినా యాక్షన్ అయితే లేదు. దాంతో రఘురామ ఎంపీగా అధికార‌ దర్జా ఒలకబోస్తూనే జగన్ మీద విమర్శల జోరు పెంచేశారు.

ఇదిలా ఉండగా ఎంపీ సొంత నియోజకవర్గానికి ఫస్ట్ టైమ్ ప్రధాని మోడీ వచ్చారు. జూలై 3న భీమవరంలో జరిగిన అల్లూరి జయంతికి ప్రధాని వస్తే లోకల్ ఎంపీగా హాజరవుదామనుకున్నా రాజు గారు రాలేకపోయారు. ఇక ఆయన నర్సాపురం ఎపుడు వచ్చారో బహుశా ఆయనకే గుర్తు ఉండదేమో. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పోటీ చేయడానికి రెబెల్ రాజు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

మరి వైసీపీకి నర్సాపురం ఎంపీ క్యాడిడేట్ ఎవరు అన్న ప్రశ్న అయితే ఉంది. నర్సాపురంలో రాజు సైడ్ అయ్యాక ఇంచార్జి బాధ్యతలను బీజేపీ నుంచి వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి అప్పగించారు. 2024 ఎన్నికల్లో వారి కుటుంబం నుంచే ఒకరు అభ్యర్ధి అవుతారు అని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉండగా సీఎం అయ్యాక చాలా కాలానికి నర్సాపురం వస్తున్న జగన్ అక్కడ ఈ నెల 28న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంగా జరిగే సభలో ఆయన ఫస్ట్ టైమ్ రెబెల్ రాజు మీద ఓపెన్ గా మాట్లాడుతారు అని అంటున్నారు. ఇప్పటిదాకా పార్టీ వారే రాజు మీద విమర్శలు చేశారు తప్ప జగన్ ఎపుడూ పెదవి విప్పలేదు.

కానీ తొలిసారిగా నర్సాపురం నుంచే రాజు మీద జగన్ బాణాలు వేయనున్నారు అని తెలుస్తోంది. ఆయన నియోజకవర్గానికి ఎంపీగా గెలిపిస్తే ఏమీ చేయేలేదని ఢిల్లీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పెడిచారని కూడా జగన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. అదే సమయంలో నర్సాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఎవరో కూడా జగన్ అక్కడే డిసైడ్ చేయనున్నారు అని అంటున్నారు.

నర్సాపురం అంటే క్షత్రియ సామాజికవర్గం ఆధిపత్యం ఉంటుంది. వారు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. అందువల్ల వారి నుంచే కొత్త అభ్యర్ధి ఉంటారని అంటున్నారు. జగన్ మంత్రివర్గం తొలి విడతలో క్షత్రియులకు స్థానం కల్పించారు. మలివిడతలో మాత్రం ఎవరూ లేరు. దాంతో ప్రభుత్వ చీఫ్ విప్ గా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుని నియమించారు. ఇపుడు క్షత్రియులను మరింతంగా అక్కున చేర్చుకునేనుకు వారికే ఎంపీ సీటు ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి రాజుకు వైసీపీకి ఇక శాశ్వతంగా సంబంధం లేదని జగన్ తన టూర్ లో చెప్పబోతున్నారు అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.