Begin typing your search above and press return to search.

మళ్ళీ జగన్ గెలుస్తారా...కేవీపీ అంచనా ఏంటి....?

By:  Tupaki Desk   |   23 Sep 2022 11:30 PM GMT
మళ్ళీ జగన్ గెలుస్తారా...కేవీపీ అంచనా ఏంటి....?
X
ఏపీలో రాజకీయ వేడి అయితే గట్టిగానే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఏణ్ణ్ణర్ధం ఉంది. అయినా సరే ఎక్కడ చూసినా సర్వేలు ఉన్నాయి. జోస్యాలు కూడా చెప్పేవారు ఉన్నారు. ఈ నేపధ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మగా పేరు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు జగన్ గురించి ఏమనుకుంటున్నారు. ఆయన మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలుస్తారా అన్నది కూడా ఆసక్తికరమైన విషయమే.

ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ మాట్లాడుతూ ఏపీలో రాజకీయాలు త్వరగానే మారుతున్నాయని అన్నారు. ఇక రాజకీయాలలో ఈ రోజుకు ఉన్న పరిస్థితి రేపటికి ఉండదు అయినా ఇపుడే జోస్యం చెప్పడం కూడా చాలా తొందరపాటు అంటూనే జగన్ విషయంలో కొన్ని సానుకూల అంశాలను చెప్పుకొచ్చారు. జగన్ కి ఈ రోజుకు ఉన్న బలం ఏంటి అంటే ఏపీలో ఉన్న మూడు ప్రాంతాలలో కూడా నలభై శాతానికి తగ్గకుండా పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉందని కేవీపీ పేర్కొన్నారు.

ఇక మిగిలిన అరవై శాతం ఆయన్ని వ్యతిరేకిస్తున్నారా లేక ఆయననే ఓటు చివరలో వేస్తారా అలా కాక ప్రత్యర్ధులకు వేస్తారా అన్నది తేలకపోయినా జగన్ కి 40 ప్లస్ శాతం ఓటు బ్యాంక్ ఉండడం మామూలు విషయం కాదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీకి కేవలం 33 శాతం ఓట్ల శాతం వచ్చినా 303 సీట్ల భారీ సంఖ్యతో గెలిచి మళ్ళీ దేశానికి రెండవ మారు ప్రధాని అయ్యారని గుర్తు చేశారు.

అందువల్ల జగన్ విషయంలో కూడా ఆ మ్యాజిక్ జరిగినా జరగవచ్చు అన్నట్లుగా కేవీపీ చెప్పుకొచ్చారు. ఇక కేవీపీ మరో విషయం కూడా చెప్పారు. 2019 తరువాత చూస్తే టీడీపీ గ్రాఫ్ ఏపీలో ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవని, అలాగే చంద్రబాబు ఎంత పోరాటాలు చేస్తున్నా కూడా అనుకున్నంతగా వేవ్ అయితే టీడీపీకి రావడం లేదని అన్నారు. ఇక జనసేనకు 2019 నాటి కంటే కూడా ఈసారి ఓట్ల శాతం బాగా పెరుగుతుందని, ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్పలేమని అన్నారు.

రాజకీయ లెక్కలలో రెండు రెండూ కలిస్తే నాలుగు అవచ్చు, ఆరు అవచ్చు, అదే టైం లో సున్నా కూడా ఒక్కోసారి కావచ్చు అని కేవీపీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ జగన్ని ఎలాగైనా దించాలనుకుంటున్నారని, జగన్ అంటే గట్టిగా వ్యతిరేకించే పవన్ చెబుతున్న సర్వేలోనే వైసీపీకి గరిష్టంగా 67 సీట్లు వస్తాయంటే వైసీపీ బలంగా ఉందనే కదా అర్ధమని కేవీపీ లాజిక్ పాయింట్ లేవనెత్తారు.

అక్కడికి అధికారానికి జగన్ 20 సీట్లు మాత్రమే తక్కువలో ఉన్నారని, అందువల్ల రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు అని కేవీపీ అంటున్నారు. జగన్ రెండవసారి సీఎం అవుతారా అన్న దానికి ఆయన ఇచ్చిన ఈ రాజకీయ విశ్లేషణ ఆసక్తిగా ఉంది. మొత్తానికి చూస్తే జగన్ బలం బాగానే ఉందని కేవీపీ చెబుతున్నట్లుగా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.