Begin typing your search above and press return to search.

బీజేపీ ఉచ్చులో జ‌న‌సేన చిక్కుతుందా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 9:32 AM GMT
బీజేపీ ఉచ్చులో జ‌న‌సేన చిక్కుతుందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన‌-బీజేపీల మ‌ధ్య ప్ర‌స్తుతం పొత్తు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడే బీజేపీలో చేరాల‌ని ఆయ‌న‌కు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆహ్వానాలు వ‌చ్చాయి. వెంక‌య్య నాయుడులాంటి వారు స్వ‌యంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మ‌రీ చర్చించారు. జాతీయ పార్టీల్లో చేరితే జ‌రిగేందేంటో తెలిసిన చిరంజీవి సొంత పార్టీ ఏర్పాటుకే మొగ్గుచూపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం త‌న సోద‌రుడి బాట‌నే అనుస‌రించారు.

కాగా ప్ర‌జారాజ్యం అస్త‌మ‌యం, ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా బీజేపీలోకి ప‌వ‌న్ ను ఆ పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. పార్టీలోకే వ‌స్తే పార్టీ ఏపీ అధ్యక్ష ప‌ద‌వితోపాటు ముఖ్య‌మంత్రిని కూడా చేస్తామ‌ని హామీ ఇచ్చింది. అయితే ప‌వ‌న్ ఆ ప్ర‌తిపాద‌న‌ల‌కు మొగ్గు చూప‌లేదు. వాస్త‌వానికి క‌ర్ణాట‌క‌లో 17 శాతం ఉన్న లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గాన్ని ఆక‌ట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ఏపీలోనూ అలాంటి సీనే రిపీట్ చేయాల‌నుకుంది. రాష్ట్రంలో అత్య‌ధిక సామాజిక‌వ‌ర్గంగా ఉన్న‌ప్ప‌టికీ అధికారాన్ని ద‌క్కించుకోలేక‌పోయిన కాపుల‌ను చేర‌దీయాల‌ని అనుకుంది.. బీజేపీ. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌ను ఏపీ య‌డ్యూర‌ప్ప‌లా చూడాల‌నుకుంది. అయితే ఆయ‌న సొంత పార్టీ ఏర్పాటుకే శ్రీకారం చుట్టారు.

అయినా కాపుల‌పై ఆశ చావ‌ని బీజేపీ.. గ‌త రెండు ప‌ర్యాయాలు ఏపీ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కాపు నేత‌లైన క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌, సోము వీర్రాజుల‌కే క‌ట్ట‌బెట్టింది. 23 నుంచి 25 శాతం వ‌ర‌కు ఉన్న‌ కాపు వ‌ర్గం చీలిపోకుండా ఉండ‌టానికి జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. మొద‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణే త‌మ కూట‌మి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అని ప‌ల్ల‌వి పాడింది. జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మిని ఏపీలో అధికారంలోకి తెస్తామ‌ని వెల్ల‌డించింది.

అయితే ప‌వ‌న్ బీజేపీలో చేర‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం, పొత్తుల విష‌యంలో టీడీపీ వైపు చూస్తుండ‌టం వంటి కార‌ణాల‌తో బీజేపీ అధిష్టానం మ‌న‌సు మారింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ఏపీకి వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నుంచి ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ సునీల్ ధియోధ‌ర్ వ‌ర‌కు అంతా బీజేపీని ఏపీలో సొంతంగా అధికారంలోకి తీసుకురావాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో 5000 స‌భ‌లు నిర్వ‌హించి బీజేపీని అధికారంలోకి తెస్తామ‌ని సోము వీర్రాజు కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను లైట్ తీసుకుంద‌నే అంటున్నారు.

బీజేపీలో చెప్పుకోవ‌డానికి చాలామంది నేత‌లు ఉన్నా, వేరే పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు చేరినా జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన నేత‌, మాస్ లీడ‌ర్ ఆ పార్టీకి లేరు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌ను బీజేపీలో విలీనం చేయించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్వారా త‌మ కార్యం నెర‌వేర్చుకోవాల‌నుకుంది. అయితే ప‌వ‌న్ త‌న సొంత పంథాలోనే సాగుతున్నారు. జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి పోటీ చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దంటున్నారు. రెండు పార్టీల‌కు సంస్థాగ‌త బ‌లం లేద‌ని చెబుతున్నారు.

ఓవైపు తాము 175 సీట్ల‌లో పోటీ చేస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు జ‌న‌సేనతో క‌లిసి ముందుకు సాగుతామ‌ని అంటున్నారు. ఇది బీజేపీ ద్వంద్వ ధోర‌ణికి నిద‌ర్శ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కాగా రాష్ట్రంలో ఒక్క వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీని మిన‌హాయించి అన్ని పార్టీలతోనూ ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ పొత్తులు పెట్టుకుని ఉన్నారు. ఈ పొత్తుల రాజ‌కీయాలతో ప‌వ‌న్ త‌ల‌పండిపోయి ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగ‌డ‌మే మేల‌నే ఉద్దేశంలో ప‌వ‌న్ ఉన్నార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీని ఆయ‌న వ‌దుల్చుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని వివ‌రిస్తున్నారు. బీజేపీ ఉచ్చుకు ప‌వ‌న్ చిక్కే చాన్సే లేద‌ని చెబుతున్నారు. త‌న గొంతులో ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ ఉంటుంద‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప‌లుమార్లు నొక్కివ‌క్కాణించార‌ని గుర్తు చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.