Begin typing your search above and press return to search.

మాజీ సీఎం భార్య‌తో పోటీకి జ‌య‌ప్ర‌ద రెఢీ?

By:  Tupaki Desk   |   17 July 2019 6:19 AM GMT
మాజీ సీఎం భార్య‌తో పోటీకి జ‌య‌ప్ర‌ద రెఢీ?
X
రాజ‌కీయంగా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకునే సీనియ‌ర్ న‌టీమ‌ణుల్లో జ‌య‌ప్ర‌ద పేరు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోని ఆమె.. సై అంటే సై అనేందుకు సిద్ధంగా ఉండ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వివాదాస్ప‌ద నేత‌గా పేరున్న ఆజంఖాన్ పై పోటీ చేసి ఓడిన జ‌య‌ప్ర‌ద‌.. తాజాగా మ‌రోసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లుగా వ‌స్తున్న వార్త‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. తాజాగా ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న జ‌య‌ప్ర‌ద.. ఎవ‌రిని ఎదుర్కోనున్నారో తెలుసా? యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ స‌తీమ‌ణి క‌మ్ ఇటీవ‌ల ఎంపీ ఎన్నిక‌ల్లో ఓడిన డింపుల్ యాద‌వ్ తో. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించ‌టంతో.. ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇప్పుడీ స్థానంలో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఎస్పీకి కంచుకోట‌గా ఉన్న ఈ స్థానం నుంచి స‌మాజ్ వాదీ పార్టీ త‌మ అభ్య‌ర్థిగా అఖిలేశ్ స‌తీమ‌ణి డింపుల్ యాద‌వ్ ను బ‌రిలోకి దించాల‌ని భావిస్తోంది. ఇదే విష‌యాన్ని ఎస్పీకి చెందిన నేత ఒక‌రు వెల్ల‌డించారు. రాంపూర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో డింపుల్ అయితేనే ఇట్టే గెలుస్తార‌ని.. ఆ విష‌యాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెప్పారు. డింపుల్ బ‌రిలోకి దిగితే.. బీజేపీ అభ్య‌ర్థిగా జ‌య‌ప్ర‌ద బ‌రిలో నిలుస్తార‌ని చెబుతున్నారు. గ‌తంలో రెండుసార్లు ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన జ‌య‌ప్ర‌ద‌.. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆజంఖాన్ చేతిలో ఓడారు.

గ‌తంలో ఎస్పీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన ఆమె.. బీజేపీ అభ్య‌ర్థిగా ఓట‌మిపాల‌య్యారు. దీంతో.. ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తాజా ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే ఈ ఉప ఎన్నిక‌ల బిగ్ ఫైట్ గా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీఎస్పీ త‌మ అభ్య‌ర్థిని తాజా ఉప ఎన్నిక‌లో దింపుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇటీవ‌ల ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్పీ.. బీఎస్పీలు రెండు క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి. అయితే.. తాము ఆశించినంతగా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాని నేప‌థ్యంలో ఈ కూట‌మి చెదిరిపోయింది. తాజాగా అఖిలేశ్ స‌తీమ‌ణి ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన నేప‌థ్యంలో పాత స్నేహాన్ని లెక్క‌లోకి తీసుకోకుండా బ‌రిలోకి దిగుతారా? లేక‌.. పోటీకి దూరంగా ఉంటారా? అన్న‌ది తేలాల్సి ఉంది.

అఖిలేశ్ స‌తీమ‌ణి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎలా అయినా ఈ స్థానాన్ని త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని బీజేపీ త‌పిస్తోంది. ఇందులో భాగంగా రాంపూర్ ఎంపీగా రెండుసార్లు విజ‌యం సాధించిన జ‌య‌ప్ర‌ద‌ను త‌మ అభ్య‌ర్థిగా దింపితే ఫ‌లితం సానుకూలంగా మార‌తుంద‌న్న ఆశ‌తో ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే.. 1980 త‌ర్వాత ఈ స్థానాన్ని ఎస్పీ త‌ప్పించి మ‌రే పార్టీ గెల‌వ‌లేదు. ఈ రికార్డును చెరిపివేయాల‌ని త‌పిస్తున్న బీజేపీ ల‌క్ష్యం నెర‌వేరుతుందో? లేదో చూడాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. మాజీ సీఎం స‌తీమ‌ణి వ‌ర్స‌స్ జ‌య‌ప్ర‌ద పోరు బిగ్ ఫైట్ గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.