Begin typing your search above and press return to search.

కాలికి వేస్తే మెడ‌కు వేస్తున్న క‌న్న‌డ స్పీక‌ర్!

By:  Tupaki Desk   |   22 July 2019 9:16 AM GMT
కాలికి వేస్తే మెడ‌కు వేస్తున్న క‌న్న‌డ స్పీక‌ర్!
X
ముదురు తెలివితేట‌ల్ని చూపించే క‌మ‌ల‌నాథుల‌కు ఒక ప‌ట్టాన అర్థం కాకుండా వ్య‌వ‌హ‌రిస్తూ.. వారి స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారు క‌ర్ణాట‌క స్పీక‌ర్ ర‌మేష్ కుమార్. భార‌త రాజ్యాంగం గొప్ప‌త‌నం ఏమంటే.. నిబంధ‌న‌ల్ని ప‌క్కాగా వాడుకోవాలే కానీ.. ఎలాంటి సంద‌ర్భాన్ని అయినా.. త‌మ‌కు త‌గ్గ‌ట్లు మార్చుకునే వీలుంటుంది. స్పీక‌ర్ ది ఏముంది? అన్న‌ట్లుగా చాలా తేలిగ్గా చూసే వారికి.. ఒక ప‌ట్టాన అర్థం కాని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు క‌ర్ణాట‌క స్పీక‌ర్.

మ‌న‌సు ప‌డిన దానిని సొంతం చేసుకోవాల‌న్న చందంగా.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాల‌న్న త‌ప‌న బీజేపీలో కాసింత ఎక్కువే. త‌మ చేతి వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిన అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి క‌మ‌ల‌నాథులు ప‌డుతున్న క‌ష్టం అంతా ఇంతా కాదు.

క‌ర్ణాట‌క‌లో అధికార‌ప‌క్షానికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల్ని త‌మ ప‌క్షాన లాగేసుకున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కుప్ప కూలుతుంద‌న్న అంచ‌నాకు భిన్నంగా జీడిపాకంలా సాగుతున్న వైనం వారికి ఇబ్బందిక‌రంగా మారింది. ఏది ఏమైనా ఈ రోజు (సోమవారం) కుమారస్వామి సంకీర్ణ స‌ర్కారు క‌థ ముగుస్తుంద‌న్న దానికి భిన్నంగా.. గ‌డిచిన కొద్ది రోజులుగా సాగుతున్న నాట‌కీయ ప‌రిణామాల్లో మ‌రో నాట‌కీయ ప‌రిణామం తాజాగా చోటు చేసుకుంది.

విశ్వాస ప‌రీక్ష సోమ‌వారం పూర్తి అయ్యేలా చూడాలంటూ ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన నేప‌థ్యంలో.. క‌ర్ణాట‌క స్పీక‌ర్ ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాన్ని తీసుకున‌నారు. రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ స‌మ‌న్లు జారీ చేశారు. జులై 23 తేదీ ఉద‌యం 11 గంట‌ల లోపు త‌న కార్యాల‌యానికి వ‌చ్చి క‌ల‌వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేప‌థ్యంలో రెబెల్ ఎమ్మెల్యేల్ని త‌న‌ను క‌ల‌వాల్సిందిగా స్పీక‌ర్ ఆదేశించటంతో బ‌ల‌ప‌రీక్ష మ‌రో రోజుకు వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. అదే స‌మ‌యంలో.. సుప్రీంను ఆశ్రయించిన ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలకు షాకిస్తూ సుప్రీంకోర్టు త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. సోమ‌వారం నాటికి బ‌ల‌ప‌రీక్ష‌ను పూర్తి చేయాల‌ని తాను ఆదేశించ‌లేన‌ని పేర్కొంది. ఇప్ప‌టికే సినిమాటిక్ మ‌లుపులు చోటు చేసుకుంటున్న క‌ర్ణాట‌క ఎపిసోడ్ లో.. రానున్న రోజుల్లో మ‌రెన్ని ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకోనున్నాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.