Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ కిశోర్‌ ను కేసీఆర్ కొన‌సాగిస్తారా? రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   31 March 2022 9:32 AM GMT
ప్ర‌శాంత్ కిశోర్‌ ను కేసీఆర్ కొన‌సాగిస్తారా?  రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌
X
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ గురించిఅంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌లే సీఎం కేసీఆర్ ఈయ‌నను ఆకాశానికి ఎత్తేశారు కూడా. ఆయ‌న త‌న‌కు మిత్రుడ‌ని.. ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంద‌ని... అందుకే రాష్ట్రంలో స‌ర్వే బాధ్య‌త‌లు అప్ప‌గిం చామ‌ని.. రూపాయి కూడా తీసుకోకుండానే ప‌నిచేస్తున్నార‌ని... సీఎం కేసీఆర్ మీడియాకు చెప్పారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప్ర‌శాంత్ కిశోర్‌ను.. కేసీఆర్ కొన‌సాగిస్తారా.. లేక‌.. మ‌ధ్య‌లోనే బంధం తెంచేసుకుం టారా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

నిజానికి తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఏడాదిపైనే స‌మ‌యం ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితి చూస్తే.. కేసీఆర్ అప్ప‌టి వ‌ర‌కు కూడా పీకేను కొన‌సాగించాలి. ఆయ‌న అవ‌స‌రంకేసీఆర్‌కు కూడా చాలానే ఉంది. అయితే.. ఇప్పుడు పీకే.. త‌న వ్యూహం మార్చుకున్నారు. కేసీఆర్ శ‌త్రువుగా భావిస్తున్న కాంగ్రెస్‌ను ఆయ‌న అక్కున చేర్చుకుంటున్నారు. త్వర‌లోనే తాను కాంగ్రెస్‌లోకి చేర‌తాన‌ని... కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని.. పీకే చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ పీకేను కొన‌సాగించే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఈ ఏడాది చివ‌రిలో కానీ.. వ‌చ్చే ఏడాది మొద‌ట్లోకానీ.. గుజరాత్ రాష్ట్ర ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా 2024 లోక్ సభ ఎన్నికలు వ‌స్తున్నాయి. వీటి కోసం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేసే అవకాశంపై రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీతో సహా కాంగ్రెస్ అగ్రనేతలతో కిషోర్ చర్చించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కిషోర్ ఎన్నికల సలహాదారుగా పనిచేయడం కంటే కాంగ్రెస్‌లో చేరడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు స‌మాచారం.

"ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీలో చేరాలని, దానిని పునర్వ్యవస్థీకరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం కూడా ఈ ఆఫర్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది" అని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. ఇక‌, కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగిస్తే పీకే విస‌యంలో కేసీఆర్‌ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యూహాలు రచించేందుకు ప్రశాంత్‌ను నియమించారు. ప్రశాంత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లేదా వైస్ ప్రెసిడెంట్ అయితే అది కేసీఆర్ కు ఖచ్చితంగా వర్కవుట్ కాదు, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ తన ప్రత్యర్థి. కాబట్టి, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రశాంత్ కేసీఆర్‌కు ఖచ్చితంగా సహాయం చేయడని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్‌తో క‌ల‌వ‌డం.. ప‌నిచేయించుకోవ‌డం..స‌రైంది కాదు.

దీంతో ప్రశాంత్ సేవలను కేసీఆర్ వదులుకోవాల్సి వస్తుంది. ఒక‌వేళ ప్రశాంత్ కాంగ్రెస్‌లో చేరకపోయినా కన్సల్టెంట్‌గా మాత్రమే మిగిలిపోయినప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేయనందున, అతన్ని కొనసాగించడానికి కేసీఆర్ ఆసక్తి చూపకపోవచ్చు. ఈ నేప‌థ్యంలో పీకే విష‌యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యం.. ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం దీనిపైనే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు తీవ్ర‌స్థాయిలో మ‌ధ‌న ప‌డుతున్నాయి. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.