Begin typing your search above and press return to search.

మోడీ కేంద్రంలో ఉండ‌గా.. కేసీఆర్‌కు మ‌ద్ద‌తు ద‌క్కేనా?!

By:  Tupaki Desk   |   17 Dec 2022 5:30 AM GMT
మోడీ కేంద్రంలో ఉండ‌గా.. కేసీఆర్‌కు మ‌ద్ద‌తు ద‌క్కేనా?!
X
ఇది చిత్ర‌మైన రాజ‌కీయం. అంద‌రూ మోడీని వ‌ద్దంటారు.. మోడీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతామ‌ని గంభీ ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తారు. మోడీని ఢిల్లీ పీఠం నుంచి దింపేయాల‌ని కూడా చెబుతారు. దీనికి సై అంటే సై ! అంటూ.. నినాదాలు కూడా చేస్తారు. కానీ, వ్య‌వ‌హారంలోకి వ‌చ్చే స‌రికి మాత్రం ఎవ‌రూ నోరు విప్ప‌రు.. కాలు క‌ద‌ప‌రు! ఈ ప‌రిణామాలు.. గ‌త రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.

అయితే.. అంతో ఇంతో సాహ‌సం చేసి.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. త‌న రాష్ట్ర‌పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. కేంద్రంలో పాగా వేస్తారా? వేయ‌గ‌ల‌రా? అనే మీమాంస‌లు ప‌క్క‌న పెడితే.. ఆయ‌న అయితే.. మోడీకి వ్య‌తిరేకంగా తొలి అడుగు అయితే క‌దిపారు క‌దా! మ‌రి దీనిని అందుకుని మోడీ వ్య‌తిరేకులు ఆయ‌న‌తో చేతులు క‌లిపితే.. అదే ప‌దివేలు క‌దా!! కానీ, అలా చేసేందుకు కూడా ఉత్త‌రాది నాయ‌కులు ముందుకు రావ‌డం లేదు.

ప్ర‌ధానంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, బిహార్‌సీఎం నితీష్ కుమార్‌, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిసా సీఎం న‌వీన్ లు ప్ర‌దాని మోడీ పాల‌న‌పై నిరంత‌రం అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. కానీ, ఎవ‌రూ కూడా కేసీఆర్‌తో ప్ర‌త్య‌క్షంగా చేతులు క‌లిపేందుకు ముందుకు రావ‌డం లేదు. దీనికి రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి వారికి కేసీఆర్‌పై స‌రైన సంపూర్ణ‌మైన‌ అభిప్రాయం అయినా లేక‌పోయి ఉండాలి.

రెండు మోడీ హ‌వాపై విప‌రీత‌మైన న‌మ్మ‌కం అయినా అయి ఉండాలి. ఈ రెండు కార‌ణాల‌తోనే వారు ముందుకు రావ‌డం లేద‌న్న‌ది నిజం. మోడీ ని నిలువ‌రించే శ‌క్తిగా కేసీఆర్‌ను వారు భావించి ఉంటే.. ఖ‌చ్చితంగా ఈ పాటికే వారికివారుగా ఢిల్లీ చేరుకుని కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా నోరు విప్పి ఉండేవారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. పైగా.. కేజ్రీవాల్, నితీష్‌లు సొంతంగానే మోడీకి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నామ‌నే సంకేతాలు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేసీఆర్ వ్యూహానికి.. ఉత్త‌రాది కీల‌క నేత‌ల అడుగుల‌కు చాలా దూరం క‌నిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.