Begin typing your search above and press return to search.

తాజా ప్రమాద బాధితులకు పరిహారం అందించేందుకు కేసీఆర్ ఆ రాష్ట్రాలకు వెళతారా?

By:  Tupaki Desk   |   14 Sep 2022 5:30 AM GMT
తాజా ప్రమాద బాధితులకు పరిహారం అందించేందుకు కేసీఆర్ ఆ రాష్ట్రాలకు వెళతారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మిగిలిన ముఖ్యమంత్రులకు కాస్తంత భిన్నంగా ఉండే అంశం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారిని వెళ్లి పరామర్శించే కార్యక్రమానికి పెద్దగా పట్టించకోరు.

అదే సమయంలో.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే.. వారి రాష్ట్రాలకు వెళ్లి మరీ పరిహారాన్ని ఇచ్చి వస్తుంటారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో.. పాస్ పోర్టు కార్యాలయానికి కూతవేటు దూరంలోని ఎలక్ట్రిక్ బైకుల షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో మంగళవారం రాత్రి నాటికి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో ఏపీలోని విజయవాడకు చెందిన అల్లాడి హరీశ్ (33).. చెన్నైకి చెందిన సీతారామన్ (48).. బాలాజీ (58).. ఢిల్లీకి చెందిన రాజీవ్ (54).. వీరేంద్రకుమార్ (50).. సందీప్ (52).. ఒడిశాకు చెందిన చందన్ (30).. మిథాలీ మహాపాత్ర (29)లు ఉన్నారు.

జాతీయ రాజకీయాల మీద గురి పెట్టిన కేసీఆర్.. ఇటీవల బిహార్ వెళ్లి..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ తో భేటీ కావటమే కాదు.. ఆ రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాద్ లో ఆ మధ్యన అగ్నిప్రమాదంలో మరణించగా.. వారి కుటుంబాలకు పరిహారాన్ని అందించారు.

మరి.. తాజా ప్రమాదంలో ఏపీ.. తమిళనాడు.. ఢిల్లీ.. ఒడిశాకు చెందిన బాధితులు ఉన్నారు. మరి.. వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాల్ని నిర్వహిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బిహార్ లోని బాధితులకు సాయం అందించే తీరులో తాజా ఎపిసోడ్ లో పరిహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించటం కష్టమన్న మాట వినిపిస్తోంది.

దీనికి కారణం.. ఏపీలో మోడీకి అనుకూలంగా ఉండే జగన్ సర్కారు ఉండటం.. తమిళనాడులో కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటిస్తున్న స్టాలిన్ సర్కారు ఉండటం.. ఒడిశాలో అందరిని సమదూరంగా ఉండే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉండటం తెలిసిందే. ఇక.. ఢిల్లీలో మాత్రం కేసీఆర్ కోరుకున్న ప్రభుత్వం ఉందని చెప్పాలి. తాజా ప్రమాదానికి సంబంధించి కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.