Begin typing your search above and press return to search.

టీయారెస్ తోనే అసెంబ్లీ బరిలోకి.... వారిని కట్టడి చేయడానికే...?

By:  Tupaki Desk   |   7 Nov 2022 7:53 AM GMT
టీయారెస్ తోనే అసెంబ్లీ బరిలోకి.... వారిని కట్టడి చేయడానికే...?
X
భారత రాష్ట్ర సమితి అంటూ దసరా శుభ వేళ కేసీయార్ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఇంకేముంది జాతీయ పార్టీ పుట్టింది. మునుగోడులో తొలిసారిగా బీయారెస్ తోనే పోటీ చేయడమే అని కూడా ఆ పార్టీ వారు చెపుకున్నారు. కానీ బీయారెస్ ని ప్రకటించాక ఇప్పటికివరకూ చూస్తే నెల రోజులు దాటి పోయాయి. ఎలాంటి కదలిక ఊసూ గోస ఏదీ బీయారెస్ నుంచి లేవు. అంటే ఒక విధంగా కేసీయార్ జాతీయ పార్టీ అన్నది మదిలో నుంచి కాగితాల వరకు మాత్రమే వచ్చి ఆగింది అని అంటున్నారు.

ఆఘమేఘాల మీద బీయారెస్ ని జాతీయ పార్టీగా రిజిష్టర్ చేయించి అంతే వేగంగా దేశమంతా తిరిగి 2024 ఎన్నికల వేళకు మోడీకి సవాల్ చేస్తామని కేసీయార్ వ్యూహాలు సిద్ధం చేశారు. కానీ ఆచరణలో మాత్రం అడుగు కూడా ముందుకు పడడంలేదని అంటున్నారు. బీయారెస్ గా టీయారెస్ ని మార్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు టీయారెస్ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, శ్రీనివాసరెడ్డి వెళ్లారు. ఢిల్లీలో వారు ఈ మేరకు భారీ కసరత్తే చేశారు.

టీయారెస్ బీయారెస్ గా మారితే దానికి కారు గుర్తుని కేటాయించాలని అదే టైం లో టీయారెస్ పేరుని ఎవరికీ ఇవ్వకుండా నిలుపుచేయాలని కూడా ఆ పార్టీ వారు ఈసీని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎంత తొందరగా ఈసీ నుంచి అనుమతులు వస్తే అంత తొందరగా ముగ్గులోకి దూకేద్దామనుకున్నారు. కానీ ఈసీ నుంచి చడీ చప్పుడూ అయితే ఇప్పటిదాకా లేదు మరి.

మరో వైపు ఈ మధ్యనే కేసీయార్ ఢిల్లీ వెళ్లారు. అప్ది రోజుల పాటు ఆయన అక్కడ మకాం వేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచారం ఏమిటి అంటే బీయారెస్ కోసం కేసీయార్ ఇతర జాతీయ పెద్దలను కలుస్తున్నారని, అందరితో మాటా మంతీ చేస్తూ జాతీయ పార్టీ సిద్ధాంతాలకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని చెప్పుకొచ్చారు కానీ కేసీయార్ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు కానీ ఆ మకాం వెనక మతలబు ఏంటి అన్నది కూడా ఎక్కడా వెల్లడి కాలేదు

ఈ లోగా కేసీయార్ సహా టీయారెస్ మొత్తం శ్రేణులు మునుగోడు ఉప ఎన్నిక మీదనే ఫోకస్ పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలని వారు పట్టుదలగా పనిచేశారు. మొత్తానికి ఉప ఎన్నిక ఫలితం టీయారెస్ కి అనుకూలంగా వచ్చింది. అయితే తెలంగాణా సార్వత్రిక ఎన్నికలు చూస్తే ఏడాది లోపు వచ్చేశాయి. దాంతో బీయారెస్ అంటూ జాతీయ స్థాయిలో హడావుడి చేయడం కంటే ముందు టీయారెస్ ని తెలంగాణాలో గెలిపించుకోవడం ముఖ్యం అన్న లెక్కలు ఆ పార్టీ పెద్దలు వచ్చేశారు అని అంటున్నరు.

టీయారెస్ కి ఉనికి ఊపిరి అంతా తెలంగాణావే. అందుకే నేల విడిచి సాము చేయకుండా ముందు అక్కడ గెలిచేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. పైగా బీయారెస్ అంటే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ లాంటి ఆంధ్రా పార్టీలు కూడా రంగంలోకి దిగి సవాల్ చేసే చాన్స్ ఉంది. పైగా బీజేపీ కూడా వాటితో జట్టుకట్టి టీయారెస్ తో ఢీ కొట్టవచ్చు.

అందుకే తెలంగాణా ఎన్నికల వరకూ ప్రాంతీయ సెంటిమెంట్ ని రగిల్చేలా టీయారెస్ తోనే రాజకీయాలు చేయడానికి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. పైగా బీయారెస్ అని సంచలన ప్రకటన చేసినా జాతీయ స్తాయిలో ఎక్కడా సౌండ్ లేకపోవడం కూడా టీయారెస్ పెద్దలను ఆలోచనలో పడేసింది అని అంటున్నారు. దాంతో బీయారెస్ దూకుడుకు కొంత విరామం ప్రకటించి ముందు తెలంగాణా గడ్డ మీదనే తమ సత్తా చూపించడానికి హ్యాట్రి కొట్టడానికి టీయారెస్ పెద్దలు ప్రిపేర్ అవుతున్నారు అని అంటున్నారు.

ఈ కారణంగానే ఈసీ మీద తొందరగా తమ పార్టీని జాతీయ పార్టీగా పేరు మార్చమని వత్తిడి చేయడంలేదు అని అంటున్నారు. మొత్తానికి కేసీయార్ ఆలోచనలు అన్నీ ఒక లెక్కన ఉంటాయి. ఆ వ్యూహాలు కూడా ఎవరికీ అంతు పట్టవు. సో ఇపుడు తెలంగాణా తారకమంత్రాన్నే మరోసారి నమ్ముకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని టీయారెస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లుగానే అనుకోవాలి. కేసీయార్ జాతీయ రాజకీయ అవతారాన్ని ఇప్పట్లో చూసే చాన్స్ లేదా అంటే దానికి కాలమే జావబు చెప్పాలేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.