Begin typing your search above and press return to search.

రైతుబంధు.. కేసీఆర్ షాకివ్వబోతున్నారా?

By:  Tupaki Desk   |   20 July 2019 6:24 AM GMT
రైతుబంధు.. కేసీఆర్ షాకివ్వబోతున్నారా?
X
రైతుబంధు.. దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ పథకం. దీనికి ప్రపంచబ్యాంక్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావుల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ పథకమే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓట్ల వాన కురిపించింది. ఇక కేసీఆర్ రైతుబంధు గ్రాండ్ హిట్ కావడంతో ఈస్ఫూర్తితోనే ప్రధాని మోడీ ఎన్నికల ముందర ‘పీఎం కిసాన్’ పెట్టి ఎకరానికి 2వేల చొప్పున సంవత్సరానికి 6వేలను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక వివిధ రాష్ట్రాలు అమలు చేసినా కేసీఆర్ అంత మొత్తం ఇవ్వలేకపోయాయి. దీంతో కేసీఆర్ రైతుబందే ఇప్పటికే ఎవర్ గ్రీన్ గా ఉంది.

అయితే ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. గడిచిన రెండు సార్లు ఠంచన్ గా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసిన కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఎకరానికి పెరిగిన రూ.5వేలు రైతుల ఖాతాల్లో ఇప్పటికీ వేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా తెలంగాణలో సాగుకు సిద్ధమైన 5 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. కానీ ఐదు ఎకరాల పైన ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదట.. వారంతా అధికారులను నిలదీస్తూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా నోరు మెదపడం లేదట..

దీన్ని బట్టి కేసీఆర్ సర్కారుకు రైతుబంధు భారంగా మారిందని అర్థమవుతోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 5 ఎకరాలు మించి ఉన్న రైతులకు కేసీఆర్ సర్కారు రైతు బంధును కట్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు డబ్బులు వేయడం.. అంతకుమించిన వారికి వేయకపోవడంతో ఇప్పుడు రైతులంతా ఆందోళన చెందుతున్నారు. 5 ఎకరాలపైన 10 ఎకరాలుంటే 50వేలు వారి ఖాతాల్లో పడతాయి.. 20ఎకరాలుంటే ఏకంగా లక్ష రూపాయలు. అందుకే ఇప్పుడు 5 ఎకరాలను కేసీఆర్ కటాఫ్ గా పెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట.. దీనిపై ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

అయితే కేసీఆర్ నే నమ్ముకొని బయట అప్పులు చేయకుండా రైతులు రైతుబంధుపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు 5 ఎకరాలపైన రైతులకు కేసీఆర్ డబ్బులు ఇవ్వకపోవడంతో వారంతా షాక్ అవుతున్నారు.కనీసం 20 ఎకరాల లోపు రైతులకు రైతుబంధు వర్తింప చేయాలని అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు. మరి కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.