Begin typing your search above and press return to search.

జూనియర్ ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అవుతారా...?

By:  Tupaki Desk   |   3 Sep 2022 12:30 AM GMT
జూనియర్ ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అవుతారా...?
X
తండ్రి పలుమార్లు ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఒకానొక దశలో లోక్ సభ స్పీకర్ పదవికి కూడా రెడీ అయ్యారు. ఇక రైల్వే బోర్డ్ చైర్మన్ గా పనిచేశారు. జాతీయ స్థాయిలో ఒకనాడు చంద్రబాబు చక్రం తిరగడానికి మూల కారకుడిగా కింజరాపు ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆన అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఢిల్లీలో సత్తా చాటారు. ఇపుడు ఆయన ఏకైక కుమారుడు రామ్మోహననాయుడు తండ్రి అడుగుజాడలలో నడుస్తూ డైనమిక్ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు.

రెండు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహననాయుడు లోక్ సభలో ప్రసంగం చేస్తే సీనియర్ ఎంపీలు కూడా శ్రద్ధగా వింటారు. సబ్జెక్ట్ మీద బాగానే కమాండ్ సంపాదించిన రామ్మోహననాయుడు తండ్రిని మించేలాగే ఉన్నారని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు ఒక వార్త గట్టిగా ప్రచారంలో ఉంది. సాధ్యమైనంత త్వరలో ఎన్డీయేలో టీడీపీ జాయిన్ అవుతుంది అని. ఆ తరువాత కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరుతుందని.

ఏపీకి సంబంధంచి నాలుగేళ్ళుగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. పైగా జేడీయూ ఎన్డీయే నుంచి వెళ్ళిపోవడంతో ఆ ఖాళీలు ఉన్నాయని అంటున్నారు. దాంతో వాటిని భర్తీ చేయడానికి టీడీపీకి మంత్రి పదవులు ఇస్తారని వినిపిస్తోంది. లోక్ సభ రాజ్యసభ కలిపి టీడీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. దాంతో మంత్రి పదవి ఒక్కటి అయినా దక్కుతుంది అంటున్నారు. దాంతో ఇపుడు కేంద్ర మంత్రి ఏపీ నుంచి ఎవరు అవుతారు అన్న చర్చ కూడా వస్తోంది.

లోక్ సభలో చూస్తే ముగ్గురు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కనకమేడల ఎంపీగా ఉన్నారు. ఒక్క రామ్మోహన్ తప్ప అందరూ అగ్ర వర్ణాలకు చెందిన వారే. పైగా టీడీపీ సామాజికవర్గానికి చెందిన వారే. దాంతో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా యూత్ కి పట్టం కట్టాలనుకున్నా ఉత్తరాంధ్రా నుంచి కోటా ఇవ్వాలనుకున్నా రామ్మోహన్ నాయుడు కి మించిన చాయిస్ లేదు, పోటీ కూడా లేదు. దాంతో తండ్రి మాదిరిగానే రామ్మోహన్ కి కూడా కేంద్ర మంత్రి పదవి రాసి పెట్టి ఉందా అన్న చర్చ సాగుతోంది.

రామ్మోహననాయుడు సమర్ధవంతమైన ఎంపీగా ఉన్నారు. పైగా ఆయన ప్రసంగాలకు ప్రధాని మోడీ సైతం ముచ్చట పడిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటు గతంలో ఉత్తరాంధ్రా నుంచి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి రాజు ప్రాతినిధ్యం వహించారు. ఇపుడు రామ్మోహన్ కి ఇస్తే ఉత్తరాంధ్రాలో టీడీపీ కంచుకోటలను కాపాడుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది అంటున్నారు. అలాగే బీసీలకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పుకున్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి ఎన్డీయేలో టీడీపీ చేరడం ఖాయమని అంటున్నారు, మంత్రి పదవుల దాకా ప్రచారం ఊపందుకున్న వేళ పరిణామాలు చాలా వేగంగా మారుతాయనే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.