Begin typing your search above and press return to search.

కొడాలి, వంశీలను వెలేస్తారా ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 8:30 AM GMT
కొడాలి, వంశీలను వెలేస్తారా ?
X
మంత్రి కొడాలి నాని, ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పై సామాజిక బహిష్కరణ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. కమ్మ సామాజికవర్గంలో జరిగే ఫంక్షన్లకు వీళ్ళద్దరిని పిలవకూడదనే డిమాండ్లు అంతర్గతంగా వినబడుతున్నాయి. ఇదే విషయమై కొడాలి, వంశీ చాలా తీవ్రంగా స్పందించారు. తమను కమ్మ సామాజికవర్గం నుండి బహిష్కరించినా తమకు జరిగే నష్టమేమీ లేదని వాళ్ళన్నారు. కమ్మ సామాజికవర్గం తమను బహిష్కరిస్తే మిగిలిన 149 కులాలు తమకు మద్దతుగా నిలబడతాయని కొడాలి అన్న విషయం తెలిసిందే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమధ్యనే హైదరాబాద్ లో కమ్మ సామాజికవర్గం రాష్ట్ర సంఘం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నారా భువనేశ్వరిపై ఎంఎల్ఏ వంశీ చేసిన కామెంట్లు చర్చకు వచ్చింది. ఇదే విషయమై అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ఆగ్రహంతో ఊగిపోవటం తర్వాత మీడియా సమావేశంలో భోరున ఏడ్చిన విషయాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ఇదే విషయమై టీవీ ఛానళ్ళ డిబేట్లలో కొడాలి చేసిన వ్యాఖ్యలు దాని తర్వాత పరిణామాలపైన కూడా సంఘం పెద్దలు చర్చించారు.

ఇంట్లోని ఆడవాళ్ళపై ఎవరు కూడా కామెంట్లు చేయకూడదని, అవమానకరంగా మాట్లాడకూడదని సంఘం పెద్దలు తీర్మానంచేశారు. అంతేకానీ కొడాలి, వంశీని సామాజికవర్గం నుండి వెలేయాలని కానీ బహిష్కరించాలని కానీ చర్చ జరగలేదు. అయితే సమావేశం తర్వాత సామాజికవర్గంలోని ముఖ్యల మధ్య మాత్రం వెలేయటం, బహిష్కరించటమనే చర్చలు జరిగినట్లు సమాచారం. కొడాల, వంశీలపై సామాజికవర్గ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్లు చేస్తున్నది తెలుగుదేశంపార్టీ ముఖ్యలే.

రాజకీయాలతో సంబంధం లేకుండా సామాజికవర్గంలో కీలకంగా ఉన్నవారు మాత్రం అలాంటి డిమాండ్లను పట్టించుకోవటంలేదు. ఏదేమైనా తన వ్యాఖ్యలపై జరిగిన వివాదానికి ముగింపు పలకాలని సామాజికవర్గంలోని కొందరు ముఖ్యులు వంశీతో గట్టిగా చెప్పిన తర్వాతే వంశీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఓ టీవీ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతు భువనేశ్వరికి క్షమాపణలు చెప్పుకున్నారు. క్షమాపణలు చెప్పుకున్న తర్వాత ఇక వంశీపై సామాజికవర్గంపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు లేవు.

అయితే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న వంశీపై ఎలాగైనా చర్యలు తీసుకునేట్లుగా సామాజికవర్గంపరంగా ఒత్తిడి పెరుగుతోందట. ఈ విషయంపైనే కొడాలి, వంశీ స్పందించారు. తమపై యాక్షన్ తీసుకునేంత సీన్ ఎవరికీ లేదని, ఒకవేళ యాక్షన్ తీసుకున్నా తమకు జరిగే నష్టం కూడా ఏమీ లేదని వీళ్ళిద్దరు స్పష్టంగా చెప్పేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తెగెదాకా లాగితే రెండువైపులా నష్టపోతారన్నది వాస్తవం. కొడాలి, వంశీ ఎలాగు తెగించారు కాబట్టి వాళ్ళకు వ్యక్తిగతంగా జరిగే నష్టం కూడా ఏమీలేదు.

మరి వారిని వెలివేయాలని ఒక వేళ నిర్ణయిస్తే తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో చూడాలి.