Begin typing your search above and press return to search.

కొండా.. కమలం అయినా కన్ఫమేనా?

By:  Tupaki Desk   |   17 July 2019 11:08 AM GMT
కొండా.. కమలం అయినా కన్ఫమేనా?
X
వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. ఆయన మారణానంతరం ఆయన కుమారుడు జగన్ పెట్టిన వైసీపీలో చేరారు. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా వెలుగొందారు. వరంగల్ జిల్లాలో గట్టి పట్టు ఉన్న వారిగా రాజకీయాలను శాసించారు. అయితే స్థిమితం లేని వీరి రాజకీయ జీవితం ఎక్కడా కుదురుకోనీయడం లేదు.

ఏ పార్టీలో ఉన్నా వీరు మొన్నటి వరకు గెలుస్తూనే వచ్చారు. వైసీపీని వీడి టీఆర్ ఎస్ లో 2014లో చేరారు. ఆంధ్రా పార్టీలో ఉండి తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వీరిని టీఆర్ ఎస్ లో చేర్చుకోవడమే పెద్ద వివాదాస్పదమైంది. ఆ తర్వాత మంత్రి పదవి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ నెరవేరకపోవడం విభేదాలతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొండా దంపతులకు కేసీఆర్ టికెట్ కూడా ఇవ్వలేదు. వారు విమర్శలు చేసి మాతృపార్టీ అయిన కాంగ్రెస్ లో తిరిగి చేరారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రైన్ రివర్స్ అయ్యింది. వీరి పరపతి, సామర్థ్యం టీఆర్ ఎస్ ధాటికి కొట్టుకుపోయింది. కొండా సురేఖ, ఆమె కూతురు ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ కూడా కేసీఆర్ ఆకర్ష్ కు కుదేలైంది. ఈ నేపథ్యంలో వీరు ఇప్పుడు బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ కు ఇప్పుడు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతుండడంతో వారు అటు చూస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే బీజేపీలో చేరికకు ముందే టికెట్ల హామీని వీరు కోరుతున్నారట.. తనకు పరకాల, కుమార్తెకు భూపాలపల్లి, మురళికి వరంగల్ పశ్చిమ ఇలా డిమాండ్ల చిట్టా విప్పారట.. అంతేకాదు.. నాయకత్వ బాధ్యతలు, కీలక పదవులు ఆశిస్తున్నారట.. వీరి డిమాండ్లు చూసి బీజేపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి మూడు నాలుగేళ్లకు ఒకసారి ఖచ్చితంగా పార్టీ మారుతున్న వీరు బీజేపీలోనైనా స్థిరంగా ఉంటారో లేదో చూడాలి మరీ.