Begin typing your search above and press return to search.

సర్వే దెబ్బకు కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారా?

By:  Tupaki Desk   |   20 Oct 2021 9:30 AM GMT
సర్వే దెబ్బకు కేటీఆర్  ముఖ్యమంత్రి కానున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి మాటలు మొదలైనంతనే.. అప్పటివరకు ఆయన్ను వ్యతిరేకించిన వారు సైతం మంత్రించినట్లుగా ఆయన మాటలకు ఫిదా అయిపోతారు. నెగిటివ్ గా ఉన్న వారు సైతం పాజిటివ్ గా మారిపోతారు. అయితే.. ఆయన మాటలకు ‘పవర్’ ఉన్నా.. ఆయన ఇమేజ్ దారుణంగా దెబ్బ తిందన్న విషయాన్ని తాజాగా ప్రకటించింది ఇండో-ఏసియన్ న్యూస్ సర్వీస్..సీ- ఓటర్ సర్వే. ‘పరిపాలనా సూచీ’ పేరుతో చేపట్టిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజాగ్రహం అధికంగా ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 30.3శాతం మంది కేసీఆర్ ను వ్యతిరేకించినట్లుగా వెల్లడించారు. సర్వే ఫలితం ప్రకారం.. దేశంలో అత్యధిక వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయన ముందుండటం గమనార్హం.

తాజా ఫలితం తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కారణం కానుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి ఏడాది క్రితమే తనకు బదులుగా తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ తలచారని.. అయితే.. ఈటల లాంటి సీనియర్ల అభ్యంతరాలతో పాటు మరికొన్ని విమర్శలతో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతారు. తాజా సర్వే నేపథ్యంలో ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చటం ద్వారా ఆగ్రహాన్ని అనుకూలంగా మార్చటంతో పాటు.. కొడుకును సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న కలను తీర్చుకునే వీలు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు కారణంగా ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం కొంత మేర తగ్గిందని.. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో చేపడితే.. సానుకూల మార్పు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. తాజాగా వెల్లడైన సర్వే ఫలితాన్ని పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తన మైండ్ సెట్ ను మార్చుకొని కొడుక్కి పగ్గాలు ఇస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.