Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో లేఆఫ్స్ బాంబ్.. ఉద్యోగులకు ముందస్తు అలర్ట్..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 6:30 AM GMT
కొత్త ఏడాదిలో లేఆఫ్స్ బాంబ్.. ఉద్యోగులకు ముందస్తు అలర్ట్..!
X
మరో నాలుగు రోజులేతే ప్రజలంతా న్యూ ఇయర్ (2023)లోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కొత్త ఏడాదిలో ఏం చేయాలి? ఏం చేయకూడదు వంటి వాటిపై ఇప్పటికే లెక్కలేసుకొని ఉంటారు. అయితే వీరి అంచనాలన్నీ కొత్త ఏడాదిలో నెరవేరుతాయా? లేదా అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎందుకంటే చైనాలో మళ్లీ కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. చైనాలో జీరో కోవిడ్ విధానం ఎత్తివేయడంతో ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వంటి కొత్త వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో చైనాలోని ఆస్పత్రులన్నీ కరోనా పేషంట్లతో కిక్కిరిసి పోగా.. శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ కరోనాపై అప్రమత్తం అవుతున్నాయి.

దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. మాస్కులు ధరించాలని.. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచనలు చేస్తున్నాయి. మరోవైపు కొత్త ఏడాదిలో ఉద్యోగులకు తిప్పలు తప్పవా? అన్న సంకేతాలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫర్ ఇచ్చాయి.

కాగా కొన్ని కంపెనీలు మాత్రం కొత్త ఏడాదిలో ఉద్యోగులపై భారీ సంఖ్యలో వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే టెక్ దిగ్గజ కంపెనీలైన గూగుల్.. అమెజాన్ ఉద్యోగులపై లేఆఫ్ బాంబు పేల్చడం చర్చనీయాంశంగా మారింది. 2023లో పనితీరు సక్రమంగా లేని కారణంగా ఆరు శాతం ఉద్యోగులను గూగుల్ ఫైర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే బాటలో అమెజాన్ సైతం లేఆఫ్స్ కు తెర తీయనుందని తెలుస్తోంది. గూగుల్ ఇటీవల తన ఉద్యోగులతో సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించింది. పుల్ టైమ్ ఉద్యోగుల్లో ఆరు శాతం (10వేల) మంది పని తీరు పేలవంగా ఉందని ఈ మీటింగులో అంచనా వేసింది. 22 శాతం ఉద్యోగుల పని తీరు బాగుందని.. మరికొంతమందిలో సంస్థ తెచ్చిన వర్క్ కల్చర్.. విధానపరమైన సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది.

ఈ అంచనాల ఆధారంగా వర్క్ ఫోర్స్ ను తగ్గించాలని గూగుల్ భావిస్తుందని సమాచారం. అయితే ఈ విషయంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తమ కంపెనీ ప్రతి విషయంపై పారదర్శకతను ఉంచుతుందని ఉద్యోగులకు వివరించినట్లు చెప్పారు. లేఆఫ్స్ ఉన్నాయా? లేవా? హెడ్ కౌంట్ లను ఎలా ఫైర్ చేయాలో ఆలోచిస్తున్నట్లు ఆ నివేదిక మాత్రం వెల్లడించింది.

వచ్చే ఏడాదిలో తొలగింపులు తప్పవనే సంకేతాలను గూగుల్ తన ఉద్యోగులకు పంపినట్లు కన్పిస్తోంది. అయితే అమెజాన్ మాత్రం తన ఉద్యోగుల తొలగింపును ధృవీకరించింది. అయితే ఎంత మందిని తొలగిస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అమెజాన్ లో సుమారు 20 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.