Begin typing your search above and press return to search.

లోకేష్ కి మాస్ అప్పీల్ లభిస్తుందా...?

By:  Tupaki Desk   |   31 Dec 2022 1:30 PM GMT
లోకేష్ కి మాస్ అప్పీల్ లభిస్తుందా...?
X
నారా లోకేష్. తెలుగుదేశం పార్టీకి ఏకైక వారసుడు. ఆయనకు పార్టీలో పోటీ పేచీ అయితే లేదు. అధినేత చంద్రబాబుకు ఒక్కడే కుమారుడు కావడంతో బాబు తదనంతరం పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత లోకేష్ మీద ఉంది. దాని కోసం లోకేష్ చేయాల్సిన ప్రయత్నాలు తన వంతుగా చేస్తున్నారు. 2009 ఎన్నికల నుంచి తెర వెనక రాజకీయంతో తెలుగుదేశంతో అనుబంధం పెంచుకున్న లోకేష్ ఆ తరువాత 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలోకి వచ్చారు.

ఇక చూస్తే 2017లో మంత్రి అయిన లోకేష్ రెండేళ్ల పాటు అయిదు కీలకమైన శాఖలు చూశారు. గత మూడున్నరేళ్ళుగా విపక్షంలో లోకేష్ దూకుడు చేస్తున్నా అనుకున్న స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు. దాంతో లోకేష్ తెగించి పాదయాత్రకు రెడీ అయిపోయారు. కొత్త ఏడాదిలో రాజకీయంగా హైలెట్ ఏంటి అంటే అది లోకేష్ పాదయత్ర అని చెప్పుకోవాలి. చంద్రబాబు సొంత సీటు అయిన కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

అలాగే నాలుగు వందల రోజుల పాటు ఈ పాదయాత్ర సాగబోతోంది. లోకేష్ పాదయాత్ర అనుకున్న మేరకు పూర్తి అయితే మాత్రం ఆయన కొత్త రికార్డు నెలకొల్పుతారు. ఆయన రికార్డుని సమీపంలో ఎవరూ బద్ధలు కొట్టేది కూడా ఉండదు. ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రలు యువ గళం అని పేరు పెట్టారు. ఇది పక్కా క్లాసీ టచ్ తో ఉంది. ఒక విధంగా సంగీత పోటీలకు పెట్టే పేరుగా ఉంది అని కామెంట్స్ పడుతున్నాయి.

కాస్తా ఫోర్స్ గా జనం పేరుని కూడా కలుపుతూ పాదయాత్రకు పేరు పెడితే బాగుండేది అన్న సూచనలు ఉన్నాయి. అయినా దీన్ని ఫైనల్ చేశారు. లోకేష్ కి కావాల్సింది ఇపుడు మాస్ ఇమేజ్. నిజానికి ఏపీలో చూస్తే మాస్ ఇమేజ్ ఉన్న వారిలో అగ్రగణ్యులు ఎన్టీయార్, వైఎస్సార్. వీరి తరువాత జగన్ కి ఆ మాస్ ఇమేజ్ సొంతం అయింది. చంద్రబాబును చూసుకుంటే ఆయనకు మాస్ ఇమేజ్ టచ్ తక్కువ. ఆయన తానుగా హైటెక్ సీఎం గా చెప్పుకుని క్లాస్ సెక్షన్ నుంచి బాగా ఫేవర్ ని సంపాదించుకున్నారు.

ఇక లోకేష్ విషయం తీసుకుంటే క్లాస్ మాస్ రెండింటిలో ఇంకా ఏ సెక్షన్ లోనూ అనుకున్న స్థాయిలో గ్రాఫ్ పెరగలేదు. ఒక ప్రజా నాయకుడికి కావాల్సింది మాస్ ఇమేజ్. అది కనుక ఉంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలం రాజకీయంగా కొనసాగగలరు. ఇపుడు లోకేష్ మాస్ ఇమేజ్ కోసమే పాదయాత్ర చేపడుతున్నారు అనుకోవాలి. కానీ ఆయన యాత్రకు పెట్టిన పేరుతో క్లాసిక్ టచ్ ఇచ్చేశారు. మరి అటు క్లాస్ ఇటు మాస్ రెండూ ఆయన ఆశిస్తున్నాడేమో చూడాలి.

ఇక పాదయాత్ర చేసేవారు మొత్తం సమాజాన్ని టార్గెట్ చేస్తారు. కానీ లోకేష్ కేవలం యూత్ నే టార్గెట్ చేస్తునారు. యూత్ లీడర్ గా ముందు తాను ఎదిగి దాన్ని పార్టీ విజయానికి అందించి ఆ మీదట ప్రజా నాయకుడిగా మారాలని లోకేష్ ప్లాన్ చేసుకున్నారేమో తెలియదు కానీ యూత్ వాయిస్ అంటూ ఆయన కాలు కదపబోతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో యువత ప్రభావం చాలా ఉంటుంది. ఇక రాజకీయంగా అగ్ర నేతలలో చూసుకుంటే యూత్ లీడర్ గా లోకేష్ మాత్రమే ఉన్నారు.

జగన్ యభై పడిలో పడ్డారు. పవన్ కూడా యాభై ఏళ్ళు దాటేశారు. దాంతో లోకేష్ కి యూత్ వింగ్ లో పోటీ అన్నది లేదు. దాంతో ఆయన తనదైన రాజకీయంతో వారిని మచ్చిక చేసుకుంతే మరో పదేళ్ల పాటు తిరుగులేని లీడర్ గా పునాదులు వేసుకోవచ్చు. అయితే మాస్ అప్పీల్ లోకేష్ కి ఎంత వరకూ లభిస్తుంది అన్నది ఆయన ప్రసంగాలు ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తానికి లోకేష్ కాలు కదిపితే ఏపీలో ఏమవుతుంది అన్నది చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.