Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో ఈసారి మోదీకి షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   9 Nov 2022 4:30 PM GMT
తెలుగు రాష్ట్రాల్లో  ఈసారి మోదీకి షాక్ తప్పదా?
X
తాము టార్గెట్ చేసుకున్న రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే అలవాటున్న ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని చెప్పాలి. కొన్ని రాష్ట్రాల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధను.. ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇటీవల కాలంలో స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆయన.. కాస్తంత గ్యాప్ ఇచ్చి మళ్లీ రానున్నారు. ఈసారి ప్రత్యేకత ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన బ్యాక్ టు బ్యాక్ అన్నట్లు పర్యటిస్తున్నారు.

ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన ఏ సందర్భంలోనూ తెలుగువారి వ్యతిరేకతను ఎదుర్కొన్నది లేదు. తెలుగు వారి ప్రేమను ఇప్పటివరకు చేసిన ఆయన.. ఈసారి తన పర్యటనలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ తప్పదన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఏపీలోని సర్కారు మోడీకి మిత్రుడిగా.. ఆయనకు అత్యంత విధేయుడిగా వ్యవహరించటం తెలిసిందే. ఇలాంటప్పుడు ఆయన పర్యటన మొత్తం సాఫీగా సాగుతుందని భావిస్తే తప్పులో కాలేసినట్లుగా చెబుతున్నారు.

దీనికి కారణం..విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకం మీద కేంద్రం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో.. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు (బుధవారం) విశాఖలోని గాజువాకలో ఆందోళన చేపట్టారు. త్వరలో ప్రధాని మోడీ వస్తున్న వేళ.. అనూహ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన ఉద్యోగులు.. నిర్వాసితులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టటంతో ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలే ప్రమాదం ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ సర్కార్ కారాలు మిరియాలు నూరటం తెలిసిందే. డైలీ బేసిస్ లో మోడీ సర్కారు పైనా.. కేంద్ర ప్రభుత్వ విధానాల మీద తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ అయితే.. మోడీపై ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు..

రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి ఎప్పుడో ప్రారంభమైతే.. ఇప్పుడు జాతికి అంకితం చేయటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. మోడీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజల వ్యతిరేకత ఎలా ఉంటుందో.. వారి చైతన్యం పాళ్లు ఎంతలా ఉంటుందన్న విషయాన్ని మోడీకి అర్థమయ్యేలా చూపించటం ఖాయమంటున్నారు. మొత్తంగా గతానికి భిన్నంగా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రధాని మోడీ టూర్ ఉండటం ఖాయమని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.