Begin typing your search above and press return to search.

తుపాకీ సర్వే: 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా?

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:09 AM GMT
తుపాకీ సర్వే: 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా?
X
రెండు దఫాలు.. ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి సుపరిపాలనను అందించిన నరేంద్రమోడీని దేశ ప్రజలు గెలిపించారు. మొదటి సారి చాయ్ వాలాగా..సామాన్యుడిలా ప్రజల్లోకి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్ తో ఫైట్, సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజల కోరికలు తీరాయా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? మోడీ మళ్లీ గెలుస్తాడా? అన్న విషయాలపై ‘తుపాకీ.కామ్’ పోల్ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.

ప్రధాని మోడీ ప్రభుత్వం పూర్తయ్యి ఏడున్నరేళ్లు కావస్తోంది. తొలిసారి ఎన్నో ఆశలతో మోడీని గెలిపించారు. కానీ మోడీ హయాంలో ప్రత్యక్ష లబ్ధి ప్రజలకు కలుగలేదనే వాదన ఉంది. రెండో సారి గెలిచాక మోడీ వైఫల్యం కరోనా సమయంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అన్ని దేశాలకు ప్రజలకు మెరుగైన ప్యాకేజీ నేరుగా డబ్బులు వేశారు. కానీ మోడీ సార్ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందో ఇప్పటికీ అర్థం కాలేదు. మోడీ హయాంలో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ.. కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు.. రైతులు వ్యతిరేకిస్తున్న సాగు చట్టాలు.. రైతులు, దళితులపై దాడులు ఇలా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిపై ప్రజామోదం కంటే ప్రజా వ్యతిరేకతనే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ వస్తూనే ఉంది.

ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు బీజేపీపై వ్యతిరేకతకు కారణం అవుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగాన్ని ప్రారదోలుతానన్న మోడీ హామీ నీటి మూట అయ్యింది. మోడీ ఆశలు పెట్టుకొని యువత ఆయనకు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. కానీ వారి ఆశలు తీర్చడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి. మోడీ చరిష్మా ఈ స్థాయిలో ఉందంటే అది ఆయనకు యూత్ ఫాలోయింగ్ వల్లే వచ్చింది. కానీ కరోనా దెబ్బకు ఉపాధి పోయి ఇప్పుడు యువత నిరుద్యోగంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా అల్లాడుతోంది.

ఇక కరోనా సమయంలోనూ రాష్ట్రాలకు ఏం ఇవ్వకుండా మోడీ కూడా పంచుకుండా చేశాడని ఆయా రాష్ట్రాల సీఎంలు ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి కూడా ఆ పార్టీకి పెను విఘాతంగా మారింది. ఇటీవల యూపీలో రైతులపైకి బీజేపీ నేతలు కారుతో ఎక్కించి చంపిన వైనం కలకలం రేపుతోంది. క్లియర్ కట్ మెజార్టీ ఉన్న మోడీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడు దేశంలో ఆ పార్టీకి చేటు తెచ్చేలా ఉన్నాయి. అదే జనాభిప్రాయంలో ప్రస్ఫుటంగా కనిపించింది.

తాజాగా మా తుపాకీ .కామ్ ‘‘2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారా? లేదా? మార్పు కావాలనుకుంటున్నారా?’’ అనే సర్వే నిర్వహించగా.. ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ‘మోడీ ప్రధాని కావాలి’ అని 36.12% ప్రజలు ఓటు వేయగా.. దేశంలో ‘మార్పు కావాలి’ అని ఏకంగా 60.35% మంది కోరుకోవడం గమనార్హం. ఇక డోలాయమానంలో ‘ఏమో చెప్పలేం’ 3.53% మంది సమాధానాన్ని దాటవేశారు.

మొత్తంగా దేశంలో మోడీ వ్యతిరేక గాలి వీస్తోందని ‘తుపాకీ’ పోల్ ను బట్టి తెలుస్తోంది. ఆయనపై ప్రజల్లో అసహనం పెరిగిందని మార్పు కోరుకుంటున్నారని తేటతెల్లమైంది. మరి ఈ మార్పు 2024 వరకు ఉంటుందా? మోడీని ప్రజలు గద్దె దించుతారా? కాంగ్రెస్ కు పట్టం కడుతారా? ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.