Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఆ పార్టీతో సై?

By:  Tupaki Desk   |   5 Sep 2018 6:16 AM GMT
సూపర్ స్టార్ ఆ పార్టీతో సై?
X
రాజకీయ పార్టీలు సినీ ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుని జనాదరణ పెంచుకోవడానికి ప్రయత్నించడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఫిలిం సెలబ్రెటీలు కూడా తమ పాపులారిటీని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. దక్షిణాదిన రాజకీయ.. సినీ రంగాల మధ్య అవినాభావ సంంబంధం ఉంది. ఐతే ఈ విషయంలో కేరళ వరకు కొంచెం పరిమితులున్నాయి. అక్కడి బడా తారలు ఎవరూ పూర్తి స్థాయి రాజకీయాల వైపు చూడలేదు. మమ్ముట్టి.. మోహన్ లాల్ ఇద్దరూ కూడా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఐతే మమ్ముట్టి రాజకీయాల్లోకి రాకపోయినా కమ్యూనిస్టులకు మద్దతుగా ఉంటారన్న అభిప్రాయం ఉంది. మోహన్ లాల్ మాత్రం ఇన్నాళ్లూ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడాయన రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోహన్ లాల్ ను దువ్వుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవలే కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు సాయం పెంచాలని మోహన్ లాల్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగానే వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగినట్లు సమాచారం. లాల్ వస్తే పార్టీలో కీలక పదవి ఇస్తామని.. కేరళ బాధ్యతలు అప్పగిస్తామని భాజపా ఆఫర్ చేసినట్లు సమాచారం. లాల్ కూడా సానుకూలంగా స్పందించాడని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోపు అంగీకారం కుదిరి లాల్.. రాజకీయారంగేట్రం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. దక్షిణాదిన పాగా వేసేందుకు భాజపా చేస్తున్న విశ్వ ప్రయత్నాల్లో ఇది ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో.. తమిళనాడులో ఆ పార్టీ ప్రయత్నాలు బెడిసికొట్టగా.. కర్ణాటకలో అధికారం అందినట్లే అంది చేజారింది. మరి కేరళలో పుంజుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఏ మేర ఫలితాన్నిస్తుందో చూడాలి.