Begin typing your search above and press return to search.

మునుగోడు విజయం నంద్యాలను గుర్తు చేస్తోందా... ఆ తరువాత రిజల్ట్...?

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:30 PM GMT
మునుగోడు విజయం నంద్యాలను గుర్తు చేస్తోందా... ఆ తరువాత రిజల్ట్...?
X
ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ అభ్యర్ధులే గెలుస్తారు. వారికి ఉన్న అంగబలం, అర్ధబలం పూర్తిగా కలసివస్తాయి. పైగా ప్రజలు తాము ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను పొందడానికి ఉన్న అవకాశాలను వాడుకోవడానికి జై కొడుతూ ఉంటారు. తమ మనసులో ఎంత వ్యతిరేకత ఉన్నా దాన్ని ఉప ఎన్నికల వేళ బయటపెట్టరు. అసాదారణంగా జరిగే ఎన్నికలు తప్ప చాలా విషయాల్లో మాత్రం ఇదే జరుగుతుంది.

ఇపుడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కూడా అలాంటిదే అని అంటున్నారు. విపక్ష రాజకీయ పార్టీలు సై అంటూ ప్రభుత్వం మీద దండయాత్ర చేసినంతమాత్రాన ప్రజలు కూడా తొందరపడి ఆ వైపుగా వచ్చేయరు. ఇదే విజ్ఞత కలిగిన భారతీయ ఓటరు మార్క్ తీర్పు.

ఇపుడు మునుగోడులో కూడా అదే జరిగింది అంటున్నారు. అధికారంలో ఉన్న టీయారెస్ గెలిచింది. అంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కచ్చితంగా గెలిచేస్తుంది అని అర్ధం కాదనే అంటున్నారు. ఈ తీర్పు అయిదేళ్ల టీయారెస్ పాలన మీద పూర్తి స్థాయి తీర్పు కానే కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. మునుగోడు గెలుపు చూసుకుని అది బలుపు అనుకుంటే టీయారెస్ పప్పులో కాలేసినట్లే అంటున్నారు.

మునుగోడులో గెలిచింది అధికారిక వ్యూహం మాత్రమే. ప్రజలు కూడా ఓటేసింది తమ ఓటుతో ఏమీ కొంపలు మునగవు అని ఆలోచించి మాత్రమే. పైగా ఒక అజెండా అంటూ లేని ఉప ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నికలో అటూ ఇటూ కూడా బలబలాల మోహరింపు జరిగింది. వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు సాగాయి. చివరికి జనాలు కూడా వాటిని అనుసరించి మాత్రమే తీర్పు చెప్పారు. అంటే జస్ట్ ఇది ఒక గేమ్ మాత్రమే. దీని వల్ల యావత్తు తెలంగాణా సమాజం టీయారెస్ వెంట ఉంది అని అనుకోవడానికి అసలు వీలు లేదనే అంటున్నారు.

అయితే దీని వల్ల అధికార టీయారెస్ కి ఎంతో కొంత నిబ్బరం మాత్రం పెరిగింది. తమ వైపు జనాలు ఉన్నారని కనీసం పార్టీ జనాలకు అయినా చెప్పుకుని గోడదూకడానికి ఆలోచించేవారికి కట్టడి చేసుకునే వీలుంది. అలాగే మరో ఏడాది పాటు పాలనను సాఫీగా తాపీగా నిర్వహించడానికి బలం చేకూరింది. అంతే తప్ప ఈ ఎన్నికతో ఇక విపక్షం టోటల్ గా చిత్తు అని అసలు అనుకోవడానికి వీలు లేదు. అదే కనుక అనుకుంటే ఏపీలో టీడీపీకి పట్టిన గతే పడుతుంది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అతి నిబ్బరం ఆ పార్టీ కొంప కూల్చేసింది.

దానికి కారణం 2017లో నంద్యాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏకంగా ముప్పయి వేలకు తక్కువ కాకుండా భారీ మెజారిటీతో టీడీపీ విజయం సాధించింది. పైగా వైసీపీకి కంచుకోట లాంటి చోట ఆ పార్టీ సిట్టింగ్ సీటుని తాము గెలుచుకున్నామని ఇక రాయలసీమ సహా ఏపీ అంతా తమకు ఎదురులేదని భావించి టీడీపీ ధీమా చేసింది. చివరికి 2019లో చూస్తే టోటల్ గా ఫలితాలు చేంజి అయ్యాయి.

అంటే ఇక్కడ ఎవరైనా అర్ధం చేసుకోవాల్సిది ఉప ఎన్నికలు వేరు, అసలు ఎన్నికలు వేరు. అసలు ఎన్నికలు వచ్చినపుడు ఏకంగా ప్రభుత్వం మారుతుంది. తాము కోరుకున్న ప్రభుత్వం వస్తుంది అనుకుంటే జనాలు ఇచ్చే తీర్పులు వేరుగా ఉంటాయి. జస్ట్ ఒక్క సీటుతో ఏమీ మారదు అనుకుంటే వారి ఓటింగ్ వేరుగా మారుతుంది.

అదే నిన్న నంద్యాలలో జరిగింది, నేడు మునుగోడులో జరిగింది. సో మునుగోడు ఫలితం ఏ విధంగానూ అధికార టీయారెస్ పాలనకు రిఫరెండం కాదు. అసలు ఎన్నికల్లోనే అన్ని పార్టీల జాతకాలూ తెలిసేది. అంతవరకూ ఓపిక పట్టడమే రాజకీయ పార్టీలు చేయాల్సింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.