Begin typing your search above and press return to search.

అబ్బ..మోడీ ఆమెని వదిలే ప్రసక్తే లేదట!

By:  Tupaki Desk   |   17 May 2019 12:33 PM GMT
అబ్బ..మోడీ ఆమెని వదిలే ప్రసక్తే లేదట!
X
మాట్లాడే ప్రతి మాటకు తూకం వేసుకుని మాట్లాడే మోడీ... మహాత్మ- నాథూరామ్ గాడ్సే వ్యాఖ్యల విషయంలో పరిస్థితులు గమనించి ఆలస్యంగా స్పందించారు. కమల్ హాసన్ చేసిన హిందూ టెర్రరిజం వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి రెచ్చిపోయారు. మహాత్ముడిని చంపిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించారావిడ. దీంతో అందరూ ఆమెపై విరుచుకుపడ్డారు. సామాన్యుల నుంచి ప్రత్యర్థుల వరకు ప్రతి ఒక్కరు ఆమెను విమర్శించారు. చివరకు బీజేపీ నేతలు కూడా ఆమెను తప్పు పట్టారు. సాధ్వి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంచెం తగ్గిన సాధ్వి నిన్న తన ప్రతినిధితో సారీ చెబుతూ సందేశం పంపింది. అయినా వాతావరణం చల్లారలేదు.

తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఓ జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన సాధ్విని తీవ్రంగా తప్పపట్టారు. ‘‘గాంధీజీని అవమానించిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ను క్షమించే ప్రసక్తే లేదు. పౌర సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదించదగినవి కావు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు వందసార్లు ఆలోచించాల్సిన అవసరముంది. ఆమె క్షమాపణలు కోరినా సరే... ఆమెను ఎట్టిపరిస్థితుల్ల క్షమించే ప్రసక్తే లేదు’’ ... ఇది మోడీ చేసిన వ్యాఖ్య. ఇంకా సుమారు 50కి పైగా స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధ్వి మాటలు పార్టీకి చాలా డామేజ్ చేసే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజ్ఞాసింగ్.. తన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చుకున్నారు. ట్విట్టరులో కూడా సారీ చెప్పారు. పార్టీకి ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదన్నారు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు.

ఇదిలా ఉంటే... ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎందుకు నరేంద్ర మోడీ ఖండించలేదు, దీనిపై ఇంత ఆలస్యంగా స్పందిస్తారా అని గాంధేయ వాదులు బాధపడుతున్నారు. మహాత్ముడికే ఇలాంట పరిస్థితి ఎదురుకావడం ఘోరమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో పార్టీకి ఈ వ్యాఖ్యలు బాగా డ్యామేజ్ చేశాయి .