Begin typing your search above and press return to search.

తడుముకోకుండా ఈ లెక్కకు ఆన్సర్ ఇస్తారా నిర్మలమ్మ?

By:  Tupaki Desk   |   20 July 2022 4:39 AM GMT
తడుముకోకుండా ఈ లెక్కకు ఆన్సర్ ఇస్తారా నిర్మలమ్మ?
X
అప్పట్లో ఎలాంటి కుంభకోణాలు లేకుండా దేశాన్ని పాలించిన పెద్ద మనిషిగా దివంగత మాజీ ప్రధానిగా వాజ్ పేయ్ కు మంచి రికార్డు ఉంది. అలాంటి ఆయన ప్రభుత్వాన్ని సైతం పడగొట్టిన క్రెడిట్ ఉల్లిపాయకే దక్కింది. అప్పట్లోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా కేజీ ఉల్లిపాయ వంద రూపాయిల్ని దాటేయటంతో దేశ ప్రజలకు మా చెడ్డ కోపం వచ్చేసింది. అంటే.. అప్పటికే భారత్ వెలిగిపోతుందన్న మాట దేశమంతా మారుమోగుతున్నప్పటికీ.. వాజ్ పేయ్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో దారుణంగా ఓడించే వరకు నిద్రపోని ట్రాక్ రికార్డు భారత దేశ ప్రజలది.

అలాంటి దేశ ప్రజలకు జీఎస్టీ పేరుతో నడ్డి విరగ్గొట్టేస్తున్నమోడీ సర్కారు తీరుపై ఆగ్రహం ఒక్కసారిగా పెల్లుబుకుతోంది. ఇప్పటివరకు పలు వస్తువులకు.. వస్తు సేవలకు జీఎస్టీ పేరుతో జేబులకు చిల్లు పెడుతున్నా.. సర్లే అన్నట్లుగా ఉన్న దేశ ప్రజలకు పాలు.. పెరుగు.. పన్నీర్.. లస్సీ.. మజ్జిగ.. లాంటి వాటికి కూడా జీఎస్టీ వేయాలని డిసైడ్ చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోజువారీగా తినే తినుబండారాలపై కూడా పన్ను పోటు వేయటం ద్వారా మోడీ సర్కారు ప్రజల విషయంలో ఎలా ఆలోచిస్తుందన్న అంశంపై ఎవరికి వారు గుర్రుగా ఉన్నారు.

తాజాగా పన్ను పోటు పరిధిలోకి తెస్తున్న వస్తువుల విషయంలో మండిపడుతున్న వారు.. తమకున్న అత్యుద్భతమైన క్రియేటివిటీతో సోషల్ మీడియాను వేదికగా తీసుకొని చెలరేగిపోతున్నారు. తాజాగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు పెద్ద చిక్కు ప్రశ్నే సంధించారు. అదేమంటే.. పనీర్ బటర్ మసాలాకు జీఎస్టీ ఎంత? అన్న ప్రశ్నను సంధించారు. చూసినంతనే సింఫుల్ గా అనిపిస్తుంది కానీ.. ప్రశ్నను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఇందులో ఉన్న వ్యంగ్యం ఇట్టే అర్థం కావటంతో పాటు.. ముఖంలోకి చిరునవ్వు ఇట్టే వచ్చేస్తుంది. దాన్ని ఏడవలేక నవ్వటం అంటారనుకోండి.

ఇంతకీ ఆ లెక్కేమిటంటే.. పన్నీర్ మీద జీఎస్టీ 5 శాతం.. బటర్ మీద జీఎస్టీ 12 శాతం.. మసాలా మీద జీఎస్టీ 5 శాతం. ఇలాంటప్పుడు ఈ మూడింటితో తయారు చేసే పనీర్ బటర్ మసాలాకు ఎంత శాతం జీఎస్టీ వేస్తారంటూ సంధించిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పనీర్ బటర్ మసాలాకు పన్ను ఎంత? అన్న ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం ఇస్తారంటారా?

మొత్తంగా చూసినప్పుడు పాలు.. మజ్జిగ.. పెరుగు.. పనీర్ మీద విధించిన జీఎస్టీకి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఇంట్టో తయారు చేసుకునే పెరుగు.. రోటీలకు జీఎస్టీ వేస్తారు. ఆ తర్వాత పీల్చే ఆక్సిజన్ కు కూడా జీఎస్టీ తప్పదని ఒకరంటే.. ‘పిల్లలకు ఇచ్చే ఐస్ క్రీంకు 5 శాతం జీఎస్టీ.. పెళ్లానికి ఇచ్చే ఐస్ క్రీంకు 12 శాతం జీఎస్టీ.. లవర్ కు ఇచ్చే ఐస్ క్రీంలకు 28 శాతం జీఎస్టీ.. ఎంతైనా లవ్వర్ ఎప్పుడైనా ఖరీదే కదండీ’ అంటూ ఎటకారం ఆడేశారు.

మరో పోస్టులో.. సరికొత్త జీఎస్టీ స్లాబ్స్ ఇలా.. ‘‘నేల మీద పడుకుంటే నో జీఎస్టీ.. చాప మీద పడుకుంటే 5 శాతం..నులక మంచం మీద 8 శాతం.. నవారు మంచం మీద 10 శాతం.. పరుపు మంచం మీద 12 శాతం.. ఫోమ్ బెడ్ మీద 18 శాతం. ఇంతకీ మీరెక్కడ పడుకుంటారు?’ అంటూ కేంద్రం తీరుపై తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పెరిగిన జీఎస్టీ మీద తనకున్న కడుపు మంటను ఒక పోస్టులో.. ‘గోధుమ పిండి మీద జీఎస్టీ వేసిన నేపథ్యంలో చపాతీ తిన్న ప్రతిసారీ నిర్మలా సీతారామన్ తో కలిసి భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది’ అంటూ మండిపడ్డారు. జీఎస్టీ పేరుతో వడ్డిస్తున్న పన్ను వడ్డింపులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు.