Begin typing your search above and press return to search.

ఆయన కూడా తెలుగుదేశాన్ని వదిలేస్తున్నట్టేనా?

By:  Tupaki Desk   |   3 March 2019 10:56 AM GMT
ఆయన కూడా తెలుగుదేశాన్ని వదిలేస్తున్నట్టేనా?
X
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నూకలు చెల్లిపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య ఈ రోజు టీ ఆర్ ఎస్ లో చేరగా మరో ఎమ్మెల్యే కూడా టీ ఆర్ ఎస్ లో చేరడానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే వీరే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా గట్టి అండగా ఉండే నేత ఒకరు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వినిపిస్తోంది.

ఒకప్పుడు లోక్‌ సభలో తెలుగుదేశం పార్టీ సభాపక్ష నేతగా పనిచేసిన నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. అయితే ఏ పార్టీలో చేరాలనే దాని పై నామా ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ సీనియర్ లీడర్‌ ను టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ సంప్రదించడంతో ఆయన నిన్నమొన్నటి వరకు డైలమాలో ఉన్నారని... అయితే, కార్యకర్తలంతా ఆయన్ను కాంగ్రెస్‌ లోకివెళ్లమని సూచిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్న నామా పార్టీకి ఆర్థికంగా గట్టి మద్దతుదారన్న సంగతి తెలిసిందే. నాగేశ్వరరావు రాజకీయాలలోకి రాకముందు నుంచి వ్యాపారవేత్త. మధుకాన్ కంపెనీ అధిపతి అయిన ఆయనకు గ్రానైట్, పవర్ జనరేషన్ కంపెనీలున్నాయి. 2009లో లోక్ సభకు పోటి చేసిన సమయంలో తన ఆస్తుల విలువ 173 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు లోక్ సభకు పోటి చేసిన వారందరిలో అత్యధిక ధనవంతుడుగా ఆయన వార్తల్లో నిలిచారు.

2004 లో ఖమ్మం నుంచి టిడిపి ఎంపీగా పోటి చేసి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. లక్ష ఓట్ల మెజార్టీతో నామా పై రేణుక విజయం సాధించారు. తిరిగి 2009 లో పోటి చేయగా 1,25,000 ఓట్ల మెజార్టీతో నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి పై గెలుపొందారు. 2014 లో ఖమ్మం నుంచి వైసిసి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీ ఆర్ ఎస్ గాలి వీచినా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంది. ఆ కారణంగానే ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం. నామా కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.