Begin typing your search above and press return to search.

అప్పుడు ఇప్పుడు ఒకేలా.. 1992లోలా పాక్ వరల్డ్ కప్ గెలిచేయదుగా?

By:  Tupaki Desk   |   8 Nov 2022 2:30 AM GMT
అప్పుడు ఇప్పుడు ఒకేలా.. 1992లోలా పాక్ వరల్డ్ కప్ గెలిచేయదుగా?
X
అది 1992 వన్డే ప్రపంచ కప్. వేదిక ఆస్ట్రేలియా.. మంచి జట్టే అయినా పాకిస్థాన్ కప్ కొడుతుందని ఎవరికీ అంచనాల్లేవు.. దీనికితగ్గట్లే ప్రారంభ మ్యాచ్ ల్లో పాక్ ప్రదర్శన ఘోరంగా ఉంది.
భారత్ చేతిలో ఓడిపోయింది. మధ్యలో వర్షం కూడా పడి ఓ మ్యాచ్ రద్దయింది.. ఇక ఆ జట్టు పని అయిపోయింది.. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కల నెరవేరడం కష్టమేనని అంతా అనుకున్నారు.
కానీ, అక్కడే అద్భుతం జరిగింది.

ఇంజమాముల్ హక్ వంటి ప్రతిభావంతుడైన కుర్రాడు మెరవడం.. సమీకరణాలు అన్నీ కలిసిరావడంతో పాక్ సెమీస్ కు చేరింది. ఇక అక్కడ ప్రత్యర్థి
న్యూజిలాండ్.. మార్టిన్ క్రో దూకుడైన బ్యాటింగ్ తో మాంచి ఊపులో ఉన్న ఆ జట్టును పాక్ చిత్తు చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. దీనికితోడు ఇంగ్లండ్ తో సెమీస్ మ్యాచ్ లో వర్షం కారణంగా
దక్షిణాఫ్రికా విజయానికి దూరమైంది. అంతే.. పాక్-ఇంగ్లండ్ ఫైనల్లో తలపడ్డాయి. అద్భుత ప్రదర్శనతో పాక్ కప్ గెలిచింది. ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. ఇదీ నాటి కథ.

మరిప్పుడు.. సరిగ్గా 30 ఏళ్ల కిందట ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన వన్డే ప్రపంచ కప్ లో ఎలా జరిగిందో ఇప్పుడూ అలాగే జరిగింది. టి20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ లో భారత్ చేతిలో పాక్ ఓడింది.
అప్పటిలాగానే రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. కానీ, దానికి కాలం కలిసొచ్చింది.

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి రేసులో నిలిచింది. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పై గెలిచింది. అప్పటికీ సెమీస్ అవకాశాలు లేవు. అయితే, ఇక్కడే మ్యాజిక్ జరిగింది. అనూహ్యంగా దక్షిణాఫ్రికా సూపర్ 12 చివరి మ్యాచ్ లో ఓడిపోవడం.. బంగ్లాదేశ్ పై పాక్ గెలవడంతో ఆ జట్టు సెమీస్ గడప తొక్కింది.

అప్పుడు న్యూజిలాండే... ఇప్పడూ 1992 వన్డే ప్రపంచ కప్ సెమీస్ లో పాకిస్థాన్ ప్రత్యర్థి న్యూజిలాండ్. ఇప్పుడూ ఎదుర్కొనబోయేది న్యూజిలాండ్ నే కావడం గమనార్హం. చిత్రమేమంటే.. అప్పట్లో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించింది. నాడు డిఫెండింగ్ చాంపియన్ కూడా ఆస్ట్రేలియానే. కివీస్ పై ఓటమి ప్రభావంతో ఆసీస్ సెమీస్ చేరలేకపోయింది. ఇప్పుడూ అంతే.. తొలి మ్యాచ్ లో కంగారూలను కివీస్ మట్టికరిపించింది. ఇక 1992లోలానే సెమీస్ ప్రత్యర్థి పాకిస్థాన్. మరో విశేషమేమంటే.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తలపడింది. ఇప్పుడు కూడా ఇంగ్లండ్
మరో సెమీస్ లో భారత్ తో తలపడుతోంది.

మెల్ బోర్న్ లో భారత్ - పాక్ ఫైనల్ చూడొచ్చు 1992లో ఇంగ్లండ్ ను ఓడించిన పాక్ కప్ ఎగరేసుకుపోయింది. ఇక ప్రస్తుత ప్రపంచ కప్ విషయానికి వస్తే పాక్ కివీస్ మీద, భారత్ ఇంగ్లండ్ పై గెలిస్తే ఫైనల్లో తలపడతాయి. వచ్చే ఆదివారం మెల్ బోర్న్ లో ఫైనల్ జరుగనుంది. 1992 ప్రపంచ కప్ ఫైనల్ వేదిక కూడా మెల్ బోర్నే కావడం విచిత్రం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.