Begin typing your search above and press return to search.

ఆ మాజీ మంత్రికి ప‌వ‌న్ సీటు ఇస్తారా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 1:30 AM GMT
ఆ మాజీ మంత్రికి ప‌వ‌న్ సీటు ఇస్తారా?
X
జ‌న‌సేన పార్టీ బ‌లంగా ఉన్న జిల్లాలు.. ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు. గ‌తం కంటే ఈ జిల్లాల్లో జ‌న‌సేన బాగా బ‌లం పుంజుకుంద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నేత‌, మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు చూపు జ‌న‌సేన వైపు ఉంద‌ని అంటున్నారు.

కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క నేత‌. గ‌తంలో 1989, 1994, 1999, 2004ల్లో టీడీపీ త‌ర‌ఫున నాలుగుసార్లు, 2012లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇలా మొత్తం ఐదు ప‌ర్యాయాలు న‌ర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996 ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీగా గెలుపొందారు. 1999లో నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మంత్రివ‌ర్గంలో విద్యుత్ శాఖ‌ మంత్రిగా కూడా ప‌నిచేశారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్ప‌టి న‌ర‌సాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు.. వైఎస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో 2012 ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు పోటీ చేసి ముదునూరి ప్ర‌సాద‌రాజును ఓడించారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా న‌ర‌సాపురం నుంచి కొత్త‌ప‌ల్లి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఆ త‌ర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ గానూ కొంత కాలం ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల ముందు టీడీపీ అసెంబ్లీ టికెట్ ను బండారు మాధ‌వ‌నాయుడుకు ఇవ్వ‌డంతో కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు మ‌ళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చారు.

అయితే వైఎస్సార్సీపీ అసెంబ్లీ టికెట్‌ను ముదునూరి ప్ర‌సాద‌రాజుకు ఇచ్చింది. ఆయ‌నే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుకు ఏ ప‌ద‌వీ ద‌క్క‌లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జిల్లాల విభ‌జ‌న సంద‌ర్భంగా న‌ర్సాపురం కేంద్రంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని గ‌ట్టిగా పోరాడారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం భీమ‌వ‌రంను జిల్లా కేంద్రంగా ఎంపిక చేసింది. దీనిపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేసిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైన ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముదునూరి ప్ర‌సాద‌రాజును న‌ర‌సాపురం ఎమ్మెల్యేగా గెలిపించి త‌ప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్నారు.

ఈ వ్య‌వహారంపైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిని వైఎస్సార్సీపీ నుంచి బ‌హిష్క‌రించింది. అప్ప‌టి నుంచి అంటే గ‌త మూడు నెల‌లుగా స్థ‌బ్దుగా ఉన్న మ‌ళ్లీ దూకుడు పెంచార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ నేత‌ల‌తో స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. ఆ పార్టీ నేత‌ల‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నార‌ని స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేయాల‌నేదే కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు ప్ర‌ణాళిక అని చెబుతున్నారు. 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన కొత్త‌ప‌ల్లి రెండోస్థానంలో నిలిచారు. అలాగే తొలిసారి గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం పోటీ చేసిన జ‌న‌సేన పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కేవ‌లం 6,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో చేరి సీటు ద‌క్కించుకుని విజ‌యం సాధించాల‌ని కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు ఉవ్విళ్లూరుతున్నార‌ని చెబుతున్నారు.

అయితే న‌ర్సాపురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయ‌క‌ర్ మ‌ళ్లీ పోటీ చేసే చాన్స్ ఉంది. బొమ్మిడి నాయ‌క‌ర్ మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన మ‌త్స్య‌కార విభాగం చైర్మ‌న్‌గా ఉన్నారు. పార్టీలో క్రియాశీల‌క నేత‌ల్లో ఒక‌రిగా ఉన్నారు. అందులోనూ న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు, మ‌త్స్య‌కారుల ఓట‌ర్లు ఎక్కువ‌. ఈ నేపథ్యంలో బొమ్మిడి నాయ‌క‌ర్ కు సీటు ఇస్తే మ‌త్స్యకారుల మొగ్గు అటే ఉంటుంద‌ని అంటున్నారు. ఎలాగూ కాపులు జ‌న‌సేనకే జై కొడ‌తారు కాబ‌ట్టి ఈ సీటును ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలుచుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నారు. మ‌రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు ఆశ‌లు నెర‌వేర‌న‌ట్టే అని తెలుస్తోంది. ఏమైనా అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప కొత్త‌ప‌ల్లికి నిరాశ త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.