Begin typing your search above and press return to search.

చంద్రబాబు పిలుపును పట్టించుకుంటారా ?

By:  Tupaki Desk   |   16 Aug 2021 8:30 AM GMT
చంద్రబాబు పిలుపును పట్టించుకుంటారా ?
X
‘దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’.. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల అణచివేత, ప్రజా సంపద దోపిడికి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జనాలకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పిలుపిచ్చారు. రాష్ట్రంలో అభివృద్దికి అడ్డంకులు సృష్టిస్తు, కొనసాగిస్తున్న విధ్వంసం నుండి రక్షించు కోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని చంద్రబాబు ఇచ్చిన పిలుపే ఆశ్చర్యంగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ప్రసంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సాగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో మాజీ సీఎం మరచిపోయిన విషయం కూడా మరోకటుంది. అదేమిటంటే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రజలెప్పుడూ రోడ్లపైకి రారని. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నా ప్రజలెప్పుడూ రోడ్లపైకి రాలేదు. ఇదేమీ బ్రిటీష్ కాలం నాటి స్వాతంత్ర్యపోరాటం కాదు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిజేయటానికి.

అధికార పార్టీ పైన లేదా కూటమిపై పోరాటాలు చేయాల్సింది ప్రతిపక్షాలు మాత్రమే అన్న విషయం ఇప్పటికే అనేకసార్లు నిరూపణైంది. ఎందుకంటే ఇప్పటి ప్రతిపక్షాల పోరాటమంతా అధికారం కోసమే కాబట్టి ఈ పార్టీలకు జనాలెవరు మద్దతుగా నిలబడరు. కేంద్రస్థాయిలో నరేంద్రమోడి వ్యతిరేక శక్తులు పోరాటం చేస్తున్నా, ఏపీలో చంద్రబాబు పిలుపిస్తున్న పోరాటాలకైనా అంతిమ లక్ష్యం అధికారం అందుకోవటమే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.

కాబట్టి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎంత పిలుపిచ్చినా జనాలు రోడ్లపైకి రారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రమే ఉంది. వీళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసి జనాలను ఆకట్టుకోవాలి కానీ జనాలనే రోడ్లపైకి రమ్మంటే ఎందుకొస్తారు ? ఇక జనాల వ్యతిరేకత అంటారా అది తెలియజేయటానికి ఇంకా చాలా సమయం ఉంది. జనాలు తమ వ్యతిరేకతను ఎన్నికల సమయంలో మాత్రమే వ్యక్తం చేస్తుంటారు. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు పాలనపై జగన్ చాలాసార్లు పిలుపిచ్చారు.

అప్పట్లో జరిగిన ఆందోళనల్లో ముందువరసలో పార్టీ యంత్రాంగమే ఉండేది. ప్రత్యేక హోదా యావత్ రాష్ట్రానికి చెందిన అంశం కాబట్టి కొంత ప్రభావం జనాల మీద కూడా చూపింది. అలాగే విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ అంశం దశాబ్దాలుగా నానుతున్న విషయం కాబట్టి ఉత్తరాంధ్రవాసులు కొంత ఆందోళన చేశారు. పై రెండు సందర్భాల్లో జనాల్లోని సెంటిమెంటును జగన్ అడ్వాంటేజ్ తీసుకున్నారంతే. కాబట్టి చంద్రబాబు కూడా ఇపుడు చేయాల్సిందేమంటే హైదరాబాద్ వదిలేసి ఏపిలో రోడ్లపైకి రావాలి. తన పార్టీ నేతలను కదిలించాలి. అంతేకానీ ఎక్కడో కూర్చుని పిలుపిస్తే జరిగే పని కాదు.