Begin typing your search above and press return to search.

ప్రియాంక పార్లమెంటుకు వెళతారా ?

By:  Tupaki Desk   |   8 March 2022 10:29 AM GMT
ప్రియాంక పార్లమెంటుకు వెళతారా ?
X
ప్రియాంకా గాంధీ వాద్రా తొందరలోనే పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారా ? కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ముగిసిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రియాంక కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఐదైనా ప్రియాంక ఎక్కువ దృష్టి మాత్రం ఉత్తరప్రదేశ్ పైనే పెట్టారు. అయితే తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంటోంది.

యూపీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రియాంక 167 ర్యాలీలను, 42 రోడ్డుషోలను నిర్వహించారు. ఇది కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేశారు. ఎంతకష్టపడినా ఫలితాలైతే ప్రతికూలంగానే ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి. మహా అయితే 7 సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే చాలా ఎక్కువని సర్వేల్లో బయటపడింది.

సరే సర్వేలు, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడుతున్న ప్రియాంకను పార్లమెంటుకు పంపాలని ఆమె మద్దతుదారులు బలంగా ప్రయత్నిస్తున్నారట.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాజస్ధాన్, ఛత్తీస్ ఘర్ నుండి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుందట. అలాగే కేరళ నుండి కూడా పార్టీ ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే కేరళ నుండి వచ్చే ఒక్క అవకాశాన్ని ప్రియాంకకు ఇవ్వాలా లేకపోతే స్ధానికుడు, సీనియర్ నేత అయిన ఏకే ఆంటోనికి ఇవ్వాలా అనేది పార్టీ ఇంకా తేల్చుకోలేదు. ప్రియాంకకే అవకాశం ఇవ్వాలంటే ఒక సమస్య వస్తుంది.

అదేమిటంటే అక్కా తమ్ముళ్ళిద్దరు కేరళ నుండే పార్లమెంటులోకి ప్రవేశిస్తారా అనే ఆక్షేపణ వచ్చే అవకాశముంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధి యూపిలో ఓడిపోయి కేరళలోని వయనాడ్ లోక్ సభ నుండి గెలిచిన విషయం తెలిసిందే. అలాంటిది ఇపుడు ప్రియాంక కూడా కేరళనుండే అంటే విమర్శలు వస్తాయేమో.

అందుకనే రాజస్ధాన్, ఛత్తీస్ ఘర్ నుండైతే బాగుంటుందని సీనియర్లు అంటున్నారు. ఏదేమైనా తొందరలోనే ప్రియాంక గాంధి పార్లమెంటులోకి ప్రవేశించటం ఖాయమనే అనిపిస్తోంది.