Begin typing your search above and press return to search.

రాహుల్ పై పోస్కో కేసు పెట్టనున్నారా? అంత పెద్ద తప్పేం చేశారు?

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:35 AM GMT
రాహుల్ పై పోస్కో కేసు పెట్టనున్నారా? అంత పెద్ద తప్పేం చేశారు?
X
దారుణ నేరాలకు పాల్పడే వారిపై పెట్టే పోస్కో చట్టం కింద కేసు.. కాంగ్రెస్ ముఖ్యనేత.. అన్ని అనుకున్నట్లు జరిగితే మరోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి కుర్చీలో కూర్చునే అవకాశం ఉన్న రాహుల్ గాంధీపైన కఠినమైన పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ డిమాండ్ ను అధికార బీజేపీకి చెందిన నేతలు చేస్తుండటం గమనార్హం. ఇంతకీ అంత దారుణమైన తప్పు రాహుల్ ఏం చేశారన్న విషయానికి వస్తే.. బీజేపీ నేతలు గుక్క తిప్పుకోకుండా తమ వాదనను వినిపిస్తున్నారు.

ఢిల్లీ శివారులో ఒక బాలికపై దుండగులు దాడి చేసి గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా.. చివరకు తల్లిదండ్రులకు తెలీకుండా దహనసంస్కారాలు పూర్తి చేశారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడుసంచలనంగా మారింది. కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శల్ని సంధిస్తూ రాహుల్ గాంధీ ట్విటర్ లో ఒక పోస్టు పోస్టు చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. అంతేకాదు.. బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

ట్విట్టర్ లో రాహుల్ పోస్టు చేసిన వీడియోలో బాధిత మైనర్ బాలిక ఫోటో కనిపించేలా ఉండటంపై రగడ మొదలైంది. ఈ ఉదంతంలో దళిత అంశాన్ని రాహుల్ తన ఎజెండాగా తీసుకుంటే.. ఈ ఉదంతంలో బాధితురాలి ఫోటోను బయటకు వచ్చేలా చేసిన రాహుల్ పై బీజేపీ అండ్ కో విరుచుకుపడుతోంది. నిబంధనల ప్రకారం బాధితురాలి ఫోటో బయటకు రాకూడదని.. అలా వచ్చినందుకు కారణమైన రాహుల్ గాంధీపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బాధిత దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమన్న రాహుల్ తీరు బాగానే ఉన్నా.. బాధితులుగా మైనర్లు ఉంటే.. వారికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆ మాటకు వస్తే వారి పేరు.. తల్లిదండ్రుల పేర్లు.. వారి నివాసం ఎక్కడ? లాంటి వివరాలు ఏమీ వెల్లడి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు భిన్నంగా రాహుల్ మాత్రం.. బాధితురాలి ఫోటోను బయటపెట్టేసిన వైనాన్ని కమలనాథులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

పోస్కో చట్టంలోని సెక్ష్న్ 23 ప్రకారం రాహుల్ గాంధీ నేరానికి పాల్పడ్డారని.. ఆయనపై కేసు నమోదు చేసిన తక్షణం అరెస్టు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జాతీయ మహిళా కమిషన్ స్పందించి నోటీసులు జారీ చేసింది. ట్విస్టు ఏమంటే.. ఈ నోటీసుల్ని జారీ చేసింది రాహుల్ కు కాదు.. ట్విట్టర్ కు. దీనికి కారణం.. రాహుల్ పోస్టు చేసింది ట్విటర్ లో కావటంతో .. ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫాంకు నోటీసులు ఇచ్చారు.

ఈ మధ్యనే కేంద్రం వర్సెస్ ట్విట్టర్ మధ్య రచ్చ జరగటం.. ఈ మధ్య వరకు ట్విట్టర్ కు ఉన్న మధ్యవర్తి హోదాను కేంద్రం తొలగించిన నేపథ్యంలో ట్విట్టర్ లోపెట్టిన అన్ని పోస్టులకు ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే రాహుల్ ట్వీట్ కు ఆయనకు నోటీసులు పంపకుండా ట్విట్టర్ కు పంపారు. మరి.. దీనికి ట్విట్టర్ ఏమని బదులిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై మాత్రం కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నారు. వారి డిమాండ్ అర్థం లేనిదని కొట్టిపారేస్తున్నారు.

మహిళలకు.. బాలికలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వారిపై అఘాయిత్యాలు జరిగే మాత్రం బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తే సరిపోతుందన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా కేంద్ర సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ అత్యాచార యత్నంలో ఇప్పటివరకు ఢిల్లీ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. రాజకీయ రగడగా మారిన ఈ ఉదంతం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.